Political Heat in Khammam : ఖమ్మం జిల్లా రాజకీయ రణరంగానికి వేదికగా నిలుస్తోంది. వచ్చే ఎన్నికలకు కాకరేపుతోంది. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్.. దేశ రాజకీయ యవనికపై సత్తా చాటేందుకు తొలిమెట్టుగా ఖమ్మం జిల్లానే ఎంచుకుంది. ఈ నెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఆ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేలా ప్రణాళికలు చేస్తోంది. 100 ఎకరాల స్థలంలో సభా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలు... ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని మరో 10 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు.
అధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా.. కార్యాచరణ:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలో ఉన్న ఖమ్మం జిల్లా నుంచి భారీ బహిరంగసభ విజయవంతం చేస్తే.. ఆ ప్రభావం అధికంగా ఉంటుందని బీఆర్ఎస్ యోచిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత రెండుఎన్నికల్లో ఒక్కస్థానానికే పరిమితమైన బీఆర్ఎస్.. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆ సభను వినియోగించుకునేలా సమాయత్తం అవుతోంది. గత పరిస్థితులను అధిగమించి అధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా.. కార్యాచరణ చేపట్టింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం:ఖమ్మంబహిరంగ సభ తర్వాత అన్ని నియోజకవర్గాల్లోనూ.. పార్టీపరంగా మరింత ముందుకు వెళ్లేలా ప్రణాళికలు రచిస్తోంది. 18న నిర్వహించనున్న బహిరంగ సభ విజయవంతం కావాలంటే పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలకు చెక్‌పెట్టి నాయకులందరినీ ఒకేతాటిపైకి నడిపించేలా నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ మాత్రమే కాకుండా ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగానే రాజకీయ సైరన్ మోగిస్తున్నాయి.
పాదయాత్రకు సన్నద్ధమవుతున్న రేవంత్ రెడ్డి: నెలాఖరులో భద్రాద్రి రాములోరి దివ్యక్షేత్రం నుంచే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు సన్నద్ధమవుతున్నారు. అక్కడి నుంచే రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనుండటం, ఈ ఏడాది చివర్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కాంగ్రెస్ ఎన్నికల శంఖరావం ఆ జిల్లానుంచే పూరించినట్లవుతోంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది.
2018 ఎన్నికల్లో 6 చోట్ల విజయం సాధించింది. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో నలుగురు నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి మారారు. ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ఉన్నారు. రాజకీయంగా కార్యకర్తల బలం ఉండటం, సెంటిమెంట్‌గా పార్టీకి ఖమ్మం జిల్లా అండగా నిలవడంతో రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే పాదయాత్రకు శ్రీకారం చుట్టి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.