Political Heat in Joint Khammam District : తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్ల వేటలో బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ కోసం కొందరు.. మరో ఛాన్స్ కోసం మరికొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ క్రీడకు తెరలేపారు. ప్రపంచకప్ క్రికెట్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుని దిగ్గజ ఆస్ట్రేలియాను ఢీకొంటున్న తరుణంలో ఈ ఎన్నికల పోరు సైతం ఆటలోని వ్యూహాలను తలపిస్తోంది. ఈసారి కొడితే సిక్సరే అనే ఊపులో కొందరు అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. దీంతో వాళ్ల బ్యాటింగ్‌ను దెబ్బతీసే బౌలింగ్ వ్యూహాలకు ప్రత్యర్థులు పదునుపెడుతున్నారు.
ఖమ్మం రాజకీయం రసవత్తరం ప్రచారపర్వంలో పార్టీల దూకుడు
Khammam Constituency : ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ (Puvvada Ajay Kumar), కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) పోటీపడుతున్నారు. విమర్శల లాంటి బౌన్సర్లను సిక్సర్లుగా మల్చుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. స్కోర్ బోర్డును పరిగెత్తించే అదనపు పరుగుల మాదిరిగా హామీలు తమ మెజార్టీని నిర్దేశిస్తాయని పావులు కదుపుతున్నారు.
Aswaraopeta Constituency : అశ్వారావుపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి జారె ఆదినారాయణ పోటీ చేస్తున్నారు. ఇరువురూ నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. వరుసగా రెండోసారి విజయం సాధించాలని మెచ్చా నాగేశ్వరరావు.. అరంగేట్రంతోనే గెలుపొందాలని జారె ఆదినారాయణ ఉవ్విళ్లూరుతున్నారు.
Paleru Constituency :పాలేరులో బీఆర్ఎస్ తరఫున కందాళ ఉపేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచిపొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy), సీపీఎం అభ్యర్థిగా తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram) బరిలో నిలిచారు. క్రికెట్ ఆటలో బెట్టింగ్‌ల మాదిరి అభ్యర్థుల గెలుపోటములపై పందేలు ప్రారంభమయ్యాయి. ఆటలో గెలుపునకు ప్రతి పరుగూ కీలకమెలాగో గుర్తించిన అభ్యర్థులు.. ఏఓటూ చేజారకుండా కీలక పల్లెలపై కన్నేశారు.
ఖమ్మంలో రాజకీయ కాక - సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్
Pinapaka Constituency : పినపాకలో రేగా కాంతారావు (బీఆర్ఎస్), పాయం వెంకటేశ్వర్లు (కాంగ్రెస్) నుంచి పోటీపడుతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తామేం చేశామో ప్రజలకు చెబుతూనే.. ప్రత్యర్థి తప్పిదాలను ఎవరికివారు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తున్నారు. అడపాదడపా యార్కర్ల లాంటి మాటల తూటాలతో విమర్శలు గుప్పించుకుంటున్నారు.
Sathupalli Constituency : సత్తుపల్లిలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా సండ్ర వెంకటవీరయ్య, హస్తం పార్టీ అభ్యర్థిగా మట్టా రాగమయి పోటీ చేస్తున్నారు. ఇద్దరూ నువ్వానేనా అనేలా తలపడతున్నారు. వరుసగా నాలుగోసారి విజయం సాధించాలనే లక్ష్యంగా సండ్ర వెంకటవీరయ్య ఉండగా.. అరంగేట్రంలోనే గెలిచి తీరాలని మట్టా రాగమయి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.