Political Heat in Khammam : ఖమ్మం మరోసారి రాజకీయ బలప్రదర్శనలకు వేదికగా మారింది. కీలక నేతల విందు రాజకీయాలు.. ఆత్మీయ కలయికలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం ఆరెంపుల శ్రీసిటీలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పాలేరు నియోజకవర్గం నుంచి భారీగా ఆయన అభిమానులు తరలివచ్చారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పేరిట తాను చేసిన అభివృద్ధిని.. 10 వేల పుస్తకాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. దీనిని జిల్లాలోని ప్రజలకు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లాను పసిడి పంటలతో విలసిల్లేలా చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని తుమ్మల స్పష్టం చేశారు.
భవిష్యత్లో ఏం జరుగుతుందో కూడా తెలుసు: ఖమ్మంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అనుచరుల సమావేశంలో.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లలో బీఆర్ఎస్లో ఏం జరిగిందో తమకు తెలుసని.. భవిష్యత్లో ఏం జరుగుతుందో కూడా తెలుసని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో అర్హత ఉన్నవారంతా పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఖమ్మం డివిజన్లలో వాడ వాడకు పువ్వాడ పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 17వ డివిజన్లో స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.