ఓ కేసులో సాక్షిగా ఉన్న యువకుడు... పోలీసుల వేధింపులు తాళలేక తనువు చాలించాడు. అశ్వారావుపేటలోని జంగారెడ్డిగూడెం రహదారిలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను మూడురోజుల క్రితం కొందరు యువకులు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్న వీడియోల ఆధారంగా ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
మూడురోజులుగా వేధింపులు...
మూడురోజులుగా ఆ యువకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తున్నారు... కానీ ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదు. ఇదే కేసులో అశ్వారావుపేటలోని బండి సుబ్రహ్మణ్యం కాలనీకి చెందిన సింగిరెడ్డి కల్యాణ్ అనే 17 ఏళ్ల యువకుడిని సాక్షిగా పేర్కొన్నారు. విచారణకు రావాలంటూ మూడు రోజులుగా పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. నిందితుల్లో ఓ యువకుడి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి మాట్లాడారు. తనపైనా కేసు నమోదవుతుందేనేమోనని భయపడ్డ కల్యాణ్... ఠాణా నుంచి పరుగెత్తుకుంటూ ఇంటికెళ్లి ఫ్యానుకు ఉరేసుకున్నాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఆస్పత్రి ఎదుట ఆందోళన
ఒక్కగానొక్క కుమారుడు తమ కళ్లముందే ఆత్మహత్య చేసుకోవడం వల్ల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. యువకుడి ఆత్మహత్యతో తీవ్ర కోపోద్రిక్తులైన అశ్వారావుపేట వాసులు ఆస్పత్రి నుంచి భారీగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆందోళనకు దిగారు. యవకుడి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపైనే తీసుకెళ్లడం ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. యువకుడి మృతికి పోలీసుల వేధింపులే కారణమని కుటంబసభ్యులు, గ్రామస్థులు ఆరోపించారు. వేధింపులతోపాటు డబ్బులు ఇవ్వాలంటూ.. పోలీసులు ఇష్టానుసారంగా కొట్టడంతో కల్యాణ్ మృతిచెందాడని కుటుంబసభ్యులు వాపోయారు.
మృతదేహం ఆస్పత్రికి తరలింపు
పోలీస్ స్టేషన్ ఎదుట టెంట్ వేసుకుని బైఠాయించిన బంధువులు, గ్రామస్థులు మృతదేహంతో ఆందోళనకు దిగడం వల్ల దాదాపు 5 గంటలపాటు హైడ్రామా నడిచింది. డీఎస్పీ మధుసుదనరావు ఆధ్వర్యంలో ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల వేధింపులు తాళలేక 'సాక్షి' ఆత్మహత్య ఇదీ చూడండి: అమ్మోనియం వాహనం సీజ్.. నిందితుల అరెస్ట్