తెలంగాణ

telangana

ETV Bharat / state

PODU LANDS ISSUE: జైల్లో ఆదివాసీ మహిళా రైతుల వ్యధ... చంటిబిడ్డల తల్లుల కన్నీటి గాథ - తెలంగాణ వార్తలు

సాగుభూములకు హక్కులు కోరితే... తప్పుడు కేసులు పెట్టడమే గాక జైళ్లో తమను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారని ఖమ్మం జిల్లా ఆదివాసీ మహిళలు గోడు వెళ్లబోసుకున్నారు. పోడు భూముల కేసులో జైలు పాలైన ఎల్లన్ననగర్​ వాసులు ఇవాళ విడుదలయ్యారు. మహిళలు, చంటిబిడ్డల తల్లులు అని కూడా చూడకుండా కారాగారంలో తమను గోస పెట్టారంటూ... వారు జైలు వద్దే ఆందోళనకు దిగారు.

podu-farmers-protest-at-khammam-district-jail-after-releasing-and-they-allegations-on-jail-officers
podu-farmers-protest-at-khammam-district-jail-after-releasing-and-they-allegations-on-jail-officers

By

Published : Aug 11, 2021, 4:26 PM IST

Updated : Aug 12, 2021, 9:12 AM IST

పోడుసాగుదారుల ఆందోళన

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్‌లో పోడు భూముల విషయంలో అటవీ అధికారులపై దాడులు చేశారంటూ అరెస్టైన మొత్తం 21 మంది... జిల్లా కారాగారం నుంచి విడుదలయ్యారు. వీరిలో 18 మంది మహిళలు ఉండగా.. అందులో ముగ్గురు చంటిబిడ్డల తల్లులున్నారు. 5 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి వచ్చిన వారిని... కుటుంబసభ్యులు అక్కున చేర్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే జైళ్లో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని విడుదలైన మహిళలు వాపోయారు. అధికారుల తీరును ఖండిస్తూ జైలు వద్దే ఆందోళనకు దిగారు. చంటిపిల్లలు ఉన్నారన్న కనికరం లేకుండా భౌతికంగా వేధించారని ఆరోపించారు.

పరుష పదజాలంతో దూషిస్తూ తమచేత అనేక పనులు చేయించారని ఆదివాసీ మహిళలు ఆరోపించారు. హత్య కేసులో ఖైదీలకన్నా హీనంగా చూశారని గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్ని రకాలుగా వేధించినా తమ భూములపై హక్కు కోసం పోరాటం ఆపబోమని మహిళలు స్పష్టం చేస్తున్నారు. ఆదివాసీ మహిళలకు మద్దతుగా న్యూడెమోక్రసీ నేతలు జైలు ఆవరణలో ఆందోళనకు దిగారు. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూములకు హక్కుపత్రాలు అందించాలని కోరారు. జైళ్లో వేధింపులకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మహిళలు జైలుకొస్తే కొట్టడం సరికాదు. రోజంతా గదిలో పెట్టి తాళాలు వేయడం, చంటిపిల్లలతో సహా బియ్యం ఏరించడం అన్యాయం. తెలంగాణ కోసం కేసీఆర్‌ను కాంగ్రెస్‌ ఏ జైల్లో బంధించారో.. అదే జైల్లో మహిళలను హింసించారు. రాష్ట్రాన్ని సాధించుకుంది ఇలాంటి హింసలు అనుభవించడానికేనా? ఆ అధికారులపై, అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలి. పోడు భూములకు పట్టాలివ్వాలి. లేదంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తాం.

-పోటు రంగారావు, న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి

చర్యలు తీసుకుంటాం

మహిళలు, ఎన్డీ నేతల ఆందోళనపై జైలు సూపరింటెండెంట్ స్పందించారు. బాధితులు, ఎన్డీ నేతలతో మాట్లాడారు. జైళ్లో చేయిచేసుకునే పరిస్థితులు ఉండవని.. బాధితులు చెబుతున్న వివరాలతో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రాణాలు పోయినా సరే..

ప్రభుత్వం పోడుభూములపై తమకు హక్కు పట్టాలిచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఎల్లన్ననగర్‌ రైతులు స్పష్టం చేశారు. ప్రాణాలు పోయినా పట్టాలు వచ్చేదాకా పోరాడుతామని తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి:'పోడు పోరు'లో పసి పిల్లలు.. గుక్కపట్టి ఏడుస్తూ తల్లులతోపాటే జైలుకు...

Last Updated : Aug 12, 2021, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details