పోడు భూముల పట్టాల విషయంలో ఆదివాసీలను మోసం చేసేలా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వ్యాఖ్యలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గ బాధ్యుడు వట్టం నారాయణ విమర్శించారు. పోడు భూములపై పోరాటం చేయాలని పిలుపునివ్వాల్సిన అవసరం రేగాకి లేదని శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. పోడు హక్కుల కోసం సీఎం కేసీఆర్తో పోరాడాలని కోరారు. అప్పుడే భూములకు పట్టాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం చేతిలో అధికారులు ఉంటారా? అధికారుల చేతుల్లో ప్రభుత్వం ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంపై పోరాడలేకనే ప్రజల్ని మభ్యపెట్టేందుకు రేగా కాంతారావు ఇటువంటి నాటకానికి తెర తీశారని ఆరోపించారు. మణుగూరులో పర్యటించిన సీఎం కేసీఆర్... అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే అందరికీ పోడు భూములు పంపిణీ చేస్తానన్న హామీని ప్రజలు విశ్వసించకనే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న రేగా కాంతారావుని ప్రజలు గెలిపించిన విషయాన్ని గుర్తు చేశారు. పోడు భూముల కోసమే పార్టీ మారినట్లు రేగా కాంతారావు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.