తెలంగాణ

telangana

ETV Bharat / state

నూతన రిజిస్ట్రేషన్​ విధానం పక్కాగా అమలు.. ప్రభుత్వ చర్యలపై ప్రజల హర్షం - నూతన రిజిస్ట్రేషన్​ విధానం

డబుల్‌ రిజిస్ట్రేషన్లు జరగకుండా.. రాష్ట్రప్రభుత్వం పక్కాగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో... నూతన విధానాన్ని అమలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అయిన ఖాళీ ప్లాట్లు వెంటనే ఆన్‌లైన్‌లో మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ రికార్డుల్లో మ్యుటేషన్ చేస్తున్నారు. ఆ విధానంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

people happy for easy registrations and mutation in khammam
people happy for easy registrations and mutation in khammam

By

Published : Oct 25, 2021, 5:33 AM IST

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఖాళీ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మ్యుటేషన్ చేసే విధానం జోరుగా సాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో ఏజెన్సీప్రాంతం షెడ్యూల్‌ ఏరియాలో ఉన్నందున గిరిజనులకు మాత్రమే... ఆస్తుల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌కు అవకాశం ఉంది. 1/70 చట్టం అమల్లో లేని గ్రామాల్లో అందరికీ రిజిస్ట్రేషన్లు మ్యుటేషన్లు చేస్తున్నారు.

ప్రజల హర్షం..

మున్సిపాలిటీలు, పంచాయతీల్లో గతంలో రిజిస్ట్రేషన్ అయిన ఖాళీ ప్లాట్లు, ఇళ్ల స్థలాలు... తాజాగా కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యుటేషన్ చేసేందుకు అనువుగా.. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌లో ఐచ్ఛికం కల్పించారు. మళ్లీ ప్రత్యేకంగా పేరు మార్పిడి చేయాల్సిన అవసరం లేకుండా వెంటనే మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తి అవుతుండటంపై ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

సులువుగా రిజిస్ట్రేషన్లు..

ఖాళీ ప్లాట్లు రిజిస్ట్రేషన్ సమయంలో మ్యుటేషన్ ఫీజును... చలానా రూపంలో స్టాంపు డ్యూటీతో పాటు చెల్లించాల్సి ఉంటుంది. పంచాయతీ పరిధిలో ఖాళీ ప్లాట్లు రిజిస్ట్రేషన్ సమయంలో మ్యుటేషన్ ఫీజు కనీసం 800 చెల్లించాలి. ప్లాటు విలువ 8 లక్షలు దాటితే.. మ్యుటేషన్ ఫీజు 0.1 శాతం చొప్పున పెరుగుతుంది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ పరిధిలో ఆ ఫీజు కనీసం 3 వేలు చెల్లించాలి. ప్లాట్‌ విలువ 30 లక్షలు దాటితే మ్యుటేషన్ ఫీజు 0.1శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ విధానం వల్ల రిజిస్ట్రేషన్లు సులువుగా సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఈ కొత్తవిధానం ఎంతో ఉపయోగకరంగా ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details