vanama Raghava Case : భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను త్వరలోనే పట్టుకుంటామని పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తెలంగాణ, ఏపీలో గాలిస్తున్నామని వెల్లడించారు. అతడిపై రౌడీషీట్ కూడా నమోదు చేస్తామని వెల్లడించారు.
వనమా రాఘవను అరెస్టు చేయడానికి ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయడం జరిగింది. తెలంగాణతో పాటు ఏపీలోనూ గాలింపు చర్యలు చేపట్టాం. త్వరలోనే అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తాం. ఇప్పటికే అతనిపై చాలా కేసులు ఉన్నాయి. అంతే కాకుండా అతనిపై రౌడీషీట్ తెరుస్తాం. సాంకేతికత సాయంతో అతనికోసం గాలిస్తున్నాం. త్వరలోనే పట్టుకుంటాం.
-రోహిత్, ఏఎస్పీ పాల్వంచ
ఆది నుంచీ వివాదాస్పదమే..
వనమా రాఘవేంద్రరావుపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఘటనల్లో కేసులు కూడా నమోదయ్యాయి. ప్రజాప్రతినిధి కుమారుడిగా వనమా.. రాజకీయ వారసుడిగా నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్న రాఘవ తీరు ఆది నుంచీ వివాదాస్పదమే. పాల్వంచ గ్రామీణం, పట్టణ పోలీస్ స్టేషన్‌లలో ఇప్పటి వరకు మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. పాల్వంచ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో వనమా రాఘవేందర్‌రావుపై పలు సెక్షన్ల కింద 2 కేసులు నమోదయ్యాయి. 2013లో ప్రభుత్వ ఉద్యోగి ఉత్తర్వులు ఉల్లంఘించి, ఎన్నికల్లో డబ్బులు ఎర వేశారని కేసు నమోదైంది. అదే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, విధులకు ఆటంకం కలిగించి దౌర్జన్యం చేశారంటూ కేసు ఉంది. పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. 2006లో ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి అల్లరి మూకలతో కలిసి హంగామా చేశాడన్న ఆరోపణలపై కేసును ఎదుర్కొన్నాడు. 2017లో ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదైంది. 2020లో ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని కేసు పెట్టారు.
గిరిజన మహిళపై హత్యాయత్నం కేసులో..
2021లో ఆత్మహత్యకు పురిగొల్పారంటూ రాఘవపై కేసు నమోదైంది. పలువురి ఆత్మహత్యలకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాడు. గిరిజన మహిళ జ్యోతికి చెందిన స్థలం వివాదంలో రాఘవేంద్రరావు అనుచరులు ఆమెపై భౌతికదాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజన మహిళపై హత్యాయత్నం కేసులో రాఘవేంద్రరావు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ కేసు ఎస్సీ, ఎస్టీ కమిషన్ వరకూ వెళ్లడం సంచలనం రేపింది. పాల్వంచకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో ఏ1 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దాదాపు 20 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేసి కేసు నుంచి బయటపడ్డాడు. తాజాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులోనూ ఏ2గా రాఘవేంద్రరావుపై పోలీసు కేసు నమోదైంది. అజ్ఞాతంలో ఉన్న అతన్ని సెల్ఫీ వీడియో బయటకులాగింది.
విమర్శలకు కొదవలేదు...
అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడని.. వనమా రాఘవేంద్రరావుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో పేరుకే తండ్రి వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే అని.. అంతా కుమారుడిదే రాజ్యంగా సాగుతోందన్న విమర్శలకు కొదవలేదు. నియోజకవర్గాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తారన్న ఆరోపణలు ఆది నుంచీ ఎదుర్కొంటున్నాడు. పార్టీని, ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకుని అధికార యంత్రాంగంపై పెత్తనం చెలాయిస్తాడని వనమా రాఘవపై ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో వ్యక్తిగత పంచాయితీల నుంచి భూవివాదాలు, సెటిల్మెంట్లలో రాఘవ జోక్యం చేసుకోవడంతో వివాదస్పదమైన సంఘటనలు అనేకం గతంలోనూ వెలుగులోకి వచ్చాయి.