తెలంగాణ

telangana

ETV Bharat / state

'కారు'లో ముసలం... పాలేరులో 'కమిటీ'ల పంచాయితీ! - TRS political war news

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో అధికార తెరాసలో పుట్టిన ముసలం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఇప్పటికే ఆధిపత్యం కోసం రగిలిపోతున్న మాజీ మంత్రి తుమ్మల-ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వర్గాల మధ్య అంతరం అంతకంతకూ పెరుగుతోంది. పార్టీ సభ్యత్వ నమోదు సందర్భంగా మొదలైన ముసలం... తాజాగా నియోజకవర్గంలో ప్రకటించిన పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు వర్గపోరుకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.

paleru-trs-political-war

By

Published : Nov 15, 2019, 11:30 AM IST

Updated : Nov 15, 2019, 1:00 PM IST

పాలేరులో పదవుల పంచాయతీ...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ తెరాసలో ఇప్పటికే ఉప్పూ నిప్పులా ఉన్న మాజీ మంత్రి తుమ్మల-ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి వర్గాల మధ్య అంతరం రోజురోజుకు పెరుగుతూనే ఉంది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, టికెట్ల కేటాయింపుల నుంచీ మొదలైన వర్గ పోరు మరింతగా ముదురుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే కందాల పూర్తిగా తనవర్గానికే టికెట్లు కేటాయించారంటూ అప్పట్లోనే తుమ్మల వర్గం అసమ్మతి గళం ఎత్తుకుంది. చివరకు మాజీ మంత్రి సముదాయింపులతో వివాదం సద్దుమణిగింది. అప్పటి నుంచీ తుమ్మల వర్గం ... ఎమ్మెల్యే కందాల పర్యటనలకు దూరంగానే ఉంటోంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ పూర్తిగా ఆధిపత్యం కోసం ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే కందాల... తన అనుచరులను మాత్రమే పర్యటనల్లో వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని తుమ్మల వర్గీయులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.

జోరుగా పర్యటనలు...

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజవర్గంలో పర్యటనలకు ఆసక్తి చూపని తమ్మల... మళ్లీ ఇప్పుడిప్పుడే కార్యకర్తలను కలుస్తున్నారు. వీలు కుదురినప్పుడు, శుభకార్యాలు ఉన్నప్పుడల్లా నియోజకవర్గంలోని 4 మండలాల్లో పర్యటిస్తూ... తన అనుచరగణానికి భరోసా ఇస్తున్నారు. ఇలా తుమ్మల- అటు ఎమ్మెల్యే కందాల పర్యటనలతో రెండు వర్గాల కార్యకర్తల్లోనూ కాస్త జోష్ కనిపించింది.

కమిటీల కల్లోలం...

రెండోసారి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పార్టీ పటిష్ఠతపై తెరాస దృష్టి సారించింది. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని రాష్ట్ర పార్టీ నాయకత్వం అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీచేసింది. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు నియమించాలని ఇచ్చిన ఆదేశాలతో పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కందాల ఉపేందర్ రెడ్డి కూడా కమిటీల ఏర్పాటుపై కసరత్తు చేశారు. ఈ మేరకు నియోజకవర్గంలోని 4 మండలాలకు పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలను ఈ నెల 12 ప్రకటించారు. ఈ కమిటీల ప్రకటన పాలేరు తెరాసలో మరోసారి వర్గపోరుకు దారితీసింది. తుమ్మల వర్గం వారికి స్థానం కల్పించలేదంటూ ముసలం మళ్లీ మొదలైంది. తుమ్మల వర్గీయులు బుధవారం రాత్రి రహస్య భేటీ నిర్వహించారు. 4 మండలాల నాయకులతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఎమ్మెల్యే కందాల ఉపేంద రెడ్డి తనతో ఉన్నవారికే పెద్దపీట వేస్తున్నారని... తుమ్మల వర్గీయులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పార్టీ అధిష్ఠానం దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకుపోవాలని నిర్ణయించిన అసంతృప్తి వర్గం... ఈ నెల 17న మరోసారి బహిరంగంగగా సమావేశమై కార్యచరణ ప్రకటించాలని నిర్ణయించారు.

పోటాపోటీ సమావేశాలు...

తుమ్మల వర్గం సమావేశంతో ఎమ్మెల్యే కందాల వర్గం కూడా బలనిరూపణకు సిద్ధమైంది. ఖమ్మం గ్రామీణం మండలంలో గురువారం ఎమ్మెల్యే వర్గీయులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కూడా 4 మండలాల నుంచి నాయకులు హాజరయ్యారు. అసంతృప్త వర్గంపై మండిపడ్డారు. పార్టీలో పదవులు దక్కని వారు... తుమ్మల పేరు చెప్పుకుని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల నుంచీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కందాల వర్గం ఆరోపిస్తోంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి తాము పని చేస్తున్నామని చెబుతున్నారు. పార్టీ కోసం పనిచేసే వారికే కమిటీల్లో స్థానం కల్పించినట్లు చెబుతున్నారు.

మొత్తంగా అటు తుమ్మల వర్గం-ఇటు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి వర్గం వరుస సమావేశాలు, పరస్పర బహిరంగ విమర్శలతో పాలేరు తెరాస రాజకీయాలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. ఈ సమావేశాలపై అటు తుమ్మల, ఇటు ఎమ్మెల్యే కందాల ఎటువంటి ప్రకటనలు చేయకపోవడం వల్ల భవిష్యత్‌లో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారుతోంది.

ఇదీ చూడండి : ఆర్టీసీ విలీనానికి "తాత్కాలిక" విరామం..!

Last Updated : Nov 15, 2019, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details