Paleru reservoir: రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రిజర్వాయర్లు నిండుకండల్లా మారాయి. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ 23 అడుగులకు చేరడంతో అధికారులు 20 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో ఖమ్మం సూర్యాపేట రహదారిపై భారీగా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు భారీగా విడుదల చేయటంతో పంట పొలాలు కూడా నీటిలో మునిగిపోయాయి. పాలేరు రిజర్వాయర్ పాత కాలువ, ఎడమ కాలువ ద్వారా కూడా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.
పొంగిపొర్లుతున్న పాలేరు చెరువు:ఖమ్మం జిల్లా ఆళ్లపల్లి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రేగళ్లనుంచి మార్కోడు వెళ్లే మార్గమధ్యలో ప్రవహిస్తున్న పాలవాగులో అటవీ శాఖ మొక్కల కోసం వినియోగించిన ట్రాక్టర్ కొట్టుకుపోగా దానిని నిలువరించేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. అటవీ స్థలాల్లో మొక్కలను డంపు చేసి వస్తుండగా వాగులో వరద తాకిడి పెరగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
నీటి ప్రవాహంలో కొంత దూరం వెళ్లి ట్రాక్టర్ వాగుఒడ్డున చెట్లలో చిక్కుకుంది. ట్రాక్టర్ రాఘవాపురం గ్రామానికి చెందిందని స్థానికులు తెలిపారు. మరోవైపు ఆళ్లపల్లి-మార్కోడు మధ్యగల రహదారిలో రాఘవాపురం వద్ద ఎర్ర చెరువు అలుగు పారి ప్రధాన రహదారి తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్థులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు వాగులు పొంగిపొర్లుతున్న అత్యవసరంగా వెళ్లే వారు పలుచోట్ల దాటేందుకు యత్నిస్తున్నారు.