Grain Storage Problems in khammam: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో యాసంగి ధాన్యం సేకరణ అధికార యంత్రాంగానికి అగ్నిపరీక్షగా మారుతోంది. రెండు జిల్లాల్లోనూ ఇప్పటికే వరి కోతలు మొదలై.. ధాన్యం రైతుల చేతికొస్తుండగా మరికొన్ని రోజుల్లో ముమ్మరంగా ధాన్యం కేంద్రాలకు తరలిరానుంది. ఈ పరిస్థితుల్లో వరి కోసిన వెంటనే ధాన్యాన్ని కేంద్రాలకు తరలించేందుకు అన్నదాతలు సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ముందుగా ధాన్యం చేతికొచ్చే ప్రాంతాల్లో కేంద్రాలు ప్రారంభించి, ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
230 కేంద్రాల ద్వారా ఈసారి ధాన్యం సేకరిస్తాం: ఖమ్మం జిల్లాలో ఈ సారి ధాన్యం సేకరణ 4,34,018 మెట్రిక్ టన్నులు ఉండగా.. భద్రాద్రి జిల్లాలో 1,56,040 మెట్రిక్ టన్నుల లక్ష్యం పెట్టుకున్నారు. భద్రాద్రి జిల్లాలో 134 కేంద్రాలు, ఖమ్మం జిల్లాలో 230 కేంద్రాల ద్వారా ఈసారి ధాన్యం సేకరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అయితే ఈ సీజన్‌లో ధాన్యం సేకరణ అధికార యంత్రాంగానికి, ఇటు మిల్లర్లకు సవాలుగా మారుతోంది. గత రెండు సీజన్లలో వచ్చిన ధాన్యం నిల్వలు మిల్లర్ల వద్దే పేరుకుపోయాయి. మిల్లర్లు ధాన్యాన్ని మరబట్టి బియ్యంగా మార్చి ఎఫ్సీఐకి రవాణా చేస్తుండగా గిడ్డంగుల్లో సామర్థ్యం లేక దిగుమతి చేసుకునేందుకు ఎఫ్సీఐ ససేమిరా అంటోంది. దీంతో ఈసారి అసలు ధాన్యమే తీసుకోలేమని మిల్లర్లు ఇప్పటికే ప్రభుత్వానికి తేల్చిచెప్పారు.