సుఖ ప్రసవాలకు కేరాఫ్ అడ్రస్ ఖమ్మం ప్రభుత్వాసుపత్రి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే నిరుపేదలకు మంచి వైద్య సేవలు అందించడమే కాకుండా కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా పరిశుభ్రత పాటిస్తూ... ఇప్పటికే రెండుసార్లు ఉత్తమ కాయకల్ప అవార్డు దక్కించుకుంది ఖమ్మం ప్రభుత్వాసుపత్రి. ఇప్పుడు మరో ఘనత సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల కంటే.. ఎక్కువగా కాన్పులు జరిగే ఆసుపత్రిగా ఖమ్మం మాతా శిశు సంరక్షణ కేంద్రం నిలిచింది.
ఇచ్చట సాధారణ కాన్సులే ఎక్కువ..
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలతోపాటు సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల నుంచి వచ్చే మహిళలకు అత్యత్తమ ప్రసూతి సేవలు అందిస్తూ... ఆదర్శంగా నిలుస్తోంది. నెలవారీ పరీక్షలు నిర్వహిస్తూ... గర్భిణీలకు సుఖప్రసవాలు అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. ఏడాది క్రితం వరకు ఆసుపత్రికి వచ్చే మహిళల్లో దాదాపు 70 శాతం వరకు శస్త్ర చికిత్సలు చేసి ప్రసవాలు చేసేవారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఈ తరహా కాన్పులే కావడం వల్ల... ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ యోగితా రాణా దృష్టి సారించి అన్ని ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ కాన్పులు ఎక్కువ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించి ఇప్పటికే రెండు సార్లు కాయకల్ప అవార్డు సొంతం చేసుకున్న ఖమ్మం ఆసుపత్రి... ఇప్పుడు సాధారణ ప్రసవాల్లోనూ ప్రథమ స్థానంలో నిలిచి మన్నలు పొందుతోంది.