మొన్న మహదేవపురం.. నిన్న వీఎం బంజర.. మూలాలు మాత్రం పుణేలోనే.. మూడు రోజుల వ్యవధిలో ఖమ్మం జిల్లాలో రెండో కరోనా కేసు వెలుగుచూసింది. ఈ నెల 13వ తేదీన మహారాష్ట్ర పుణే నగరం నుంచి పెనుబల్లి మండలం వీఎం బంజరకు వచ్చిన ఏడుగురిలో ఓ మహిళకు బుధవారం కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. సదరు మహిళతోపాటు మరో ఆరుగురు ప్రత్యేక బస్సులో జిల్లాకు వచ్చారు. నిర్ధరణ పరీక్షల్లో ఆ మహిళ భర్తకు మాత్రం నెగిటివ్ వచ్చింది.
అటునుంచి వస్తే..
కరోనా ప్రభావంతో అట్టుడికిపోతున్న మహారాష్ట్ర నుంచి జిల్లాకు వచ్చే వారి విషయంలో అధికారులు మరింత అప్రమత్తం కావాల్సిన ఆవశ్యకత ఉంది. జిల్లా సరిహద్దుల్లోనే వారిని గుర్తించి తమ స్వస్థలాలకు కాకుండా ఆస్పత్రికి తీసుకువచ్చి పరీక్షలు చేశాకే పంపిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వస్థలాలకు చేరుకున్నాక గంటల వ్యవధిలోనే తీసుకవస్తున్నా, పరీక్షలు చేస్తున్నా అప్పటికే వారు ఇతరులను కలిసే అవకాశం ఉంటుందన్న ఆందోళన నెలకొంది.
ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వస్తున్నవారి వివరాలు సరిహద్దు చెక్‌పోస్టుల నుంచి అందగానే స్థానిక వైద్య, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తం అవుతున్నారు. లక్షణాలున్నా లేకున్నా వారి కుటుంబాలను క్వారంటైన్‌లో ఉండాలని చెబుతున్నారు. కొన్నిచోట్ల తామే స్థానికంగా క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు.