స్వచ్ఛంద లాక్‌డౌన్... పనివేళలు కుదింపు
ప్రజల్లో మార్పు రావడం లేదని గమనించి వ్యాపార వర్గాలు కొందరు స్వచ్ఛంద లాక్‌డౌన్ ప్రకటించారు. ఖమ్మం గాంధీచౌక్‌లోని కిరాణా జాగిరి మర్చంట్స్ వారు, బంగారు దుకాణం నిర్వాహకులు, ఐరన్, స్టీల్ అండ్ మెటల్‌వారు ఈనెల చివరి వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. ఉభయ జిల్లాల్లో మెకానిక్‌షాపులు, టీ, సెల్‌ఫోన్ దుకాణాలతో పాటు ఇతర వ్యాపార సముదాయాలను సాయంత్రం ఆరుగంటల వరకే తెరచిఉంచాలని నిర్ణయించారు. కరోనా కట్టడికి పనివేళల కుదింపు విషయం తెలిసినా కొందరు అవేమి పట్టకుండా దుకాణం ముందుగానే మూసివేస్తారనే ఆత్రుతలో నిబంధనలు విస్మరిస్తున్నారు.
గీత దాటుతున్నారు...
ఒకరికి ఒకరు కనీసం రెండు మీటర్ల దూరం ఉండాలనే నిబంధన ఉంది. లాక్‌డౌన్ మొదట్లో ప్రతి దుకాణం ఎదుట రంగులు, సుద్ద తదితరాలతో నిర్దేశిత నిడివిలో వలయాలు గీశారు. దీన్ని లక్ష్మణరేఖగా అభివర్ణించారు. అందులోనే నిలుచుని తమ వంతువరకు వేచిచూసి అక్కడ అవసరమైన సామగ్రి కొనుగోలు చేశారు. అంతవరకు బాగానే ఉంది.. అన్‌లాక్ నుంచి నిబంధనలు తోసిరాజంటున్నారు. దుకాణ సముదాయాల వద్ద గుంపులు కడుతున్నారు. భౌతిక దూరం భారమని భావిస్తే మున్ముందు వైరస్ బాధలు తప్పవని గ్రహించాలి.
మాస్క్‌లు ఓ మోస్తరు
లాక్‌డౌన్ సమయంలో మాస్క్‌ల కొరత తీవ్రంగా ఏర్పడింది. వస్త్రాలతో విరివిగా తయారు చేయడం వల్ల అందుబాటులోకి వచ్చాయి. వినియోగంపై చైతన్యం పెరిగింది. మాస్క్ ధరించిన వారికే దుకాణంలోకి అనుమతి అని, వారికే సరకులు ఇస్తామని బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కొంతమేర ఆశించినట్లే జరుగుతున్నా ఇందులోనూ లోపాలుంటున్నాయి. నాణ్యత, వాటి వినియోగంపైనా శ్రద్ధ చూపడంలేదు.
కేసులు పెరుగుతున్నా మార్పు రావట్లే...
లాక్‌డౌన్ నాళ్లలో భద్రాద్రి జిల్లాలో నాలుగు, ఖమ్మంలో ఒక కేసు తేలడం వల్ల ప్రజలు భయకంపితులయ్యారు. అందుకనుగుణంగా అధికారులు, ప్రభుత్వవర్గాలు చర్యలు తీసుకోవడం వల్ల జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఆంక్షల సడలింపులు, అధికార యంత్రాంగం కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నందున అధికులు బాధ్యత విస్మరిస్తున్నారు.
ప్రాథమిక సూత్రాలు.. ఉల్లంఘన
ప్రధానంగా పట్టణాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉండే కిరాణా దుకాణాలు, ఆసుపత్రులు, ఏటీఎం సెంటర్లు, వస్త్రవ్యాపార సంస్థలు, బంగారు దుకాణాలు, శాకాహార, మాంసాహార మార్కెట్లు, ఆటోలు, టాక్సీలు, బస్సు ప్రయాణాల్లో సహా ఇతర వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో నిబంధనలు ఎక్కువగా ఉల్లంఘన జరుగుతుంది.
శానిటైజర్ సగం.. సగం
వైరస్ వ్యాప్తి నివారించడంలో శానిటైజర్‌దీ ప్రధాన పాత్రే. వాటిని ఇంటింటా సమకూర్చుకుంటున్నారు. బయటికి వెళ్లినప్పుడు కూడా చిన్న పరిమాణంలో తీసుకెళుతున్నారు. శానిటైజర్‌తో చేతులు శుభ్ర పరుచుకుని థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష అనంతరమే దుకాణంలోకి అనుమతించాలి. కార్పొరేట్, ఇతర పెద్ద దుకాణాల్లోనే ఇది జరుగుతోంది. థర్మల్ స్క్రీనింగ్ పనిచేయదు. శానిటైజర్ సీసా ఖాళీగానే దర్శనమిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఎక్కువ చోట్ల ఇదే పరిస్థితి. ఈ రెండింటినీ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.