పార్టీల నేతల విమర్శలు ప్రతివిమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలతో రాష్ట్రంలో జరుగుతున్న మినీపోరు హోరెత్తుతోంది. వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలతో పాటు ఐదు మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో... రాజకీయ పార్టీలు 'నువ్వా-నేనా' అనే విధంగా తలపడుతున్నాయి. కరోనా కారణంగా భారీ జనసమీకరణ లేకుండా... రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలకు వెళ్తున్న నేతలు... సామాజిక మాధ్యమాలను ప్రచార వేదికలుగా చేసుకుంటున్నారు. ప్రచార గడువు ఇంకా మూడ్రోజులే మిగిలి ఉండటంతో.. డివిజన్లన్నీ చుట్టేందుకు పరుగులు తీస్తున్నారు.
క్లీన్ స్వీప్ చేస్తాం..
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస విజయం సునాయాసమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పలు డివిజన్లలో ఆయన రోడ్ షో నిర్వహించారు. నగరానికి వెయ్యి కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధి చేసిన తెరాసను నగర ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారన్న విశ్వాసం తమకు ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఖమ్మంలో మనుగడ లేదని.... అన్నిచోట్ల క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. ప్రజాసేవ చేసే తెరాసను ఆశీర్వదించాలని హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ నామ నాగేశ్వరరావు కోరారు. ఖమ్మంలోని పలు డివిజన్‌లలో రోడ్ షోలు నిర్వహించారు. కాంగ్రెస్, భాజపా నాయకులు, అభ్యర్థులు నాలుగు రోజులు మాత్రమే కనిపిస్తారని.. ఆ తర్వాత పత్తా ఉండరని ఆరోపించారు.
ఓరుగల్లులో ప్రచార హోరు
అటు వరంగల్ నగరం పార్టీల ప్రచారాలతో హోరెత్తుతోంది. ఉదయం నుంచే అభ్యర్థులు.. కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకుంటున్నారు. వీరికి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి నేతలు రంగంలోకి దిగారు. పరకాల నియోజరవర్గ పరిధిలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రోడ్ షో నిర్వహించారు. సంక్షేమం, అభివృద్ధి తెరాసతోనే సాధ్యమన్నది ప్రజలు గుర్తించి... ప్రతి ఎన్నికల్లోనూ పట్టం కట్టారన్న ఆయన... అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలను నిలదీయాలని పిలుపునిచ్చారు. అల్లిపురంలో 44వ డివిజన్ అభ్యర్థి శ్రీదేవికి మద్దతుగా మంథని జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుతో కలిసి... గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రచారం నిర్వహించారు. ప్రజల్లో చిచ్చుపెట్టే భాజపాతో, మనుగడలేని కాంగ్రెస్‌తో అభివృద్ధి సాధ్యంకాదని ఆరోపించారు. హసన్‌నపర్తిలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్.. పార్టీ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు.