క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు సైనికుల్లా రాత్రింబవళ్లూ శ్రమించడం వల్లనే ప్రతి ఎన్నికల్లోనూ తెరాసకు భారీ విజయం చేకూరుతుందని తెరాస లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. 28, 29, 30, 35, 51 డివిజన్ పార్టీ అభ్యర్థులు గజ్జెల లక్షీ, పత్తిపాక లత, ముక్కల కమల, బోజెడ్ల రామ్మోహన్‌రావు, శీలం శెట్టి రమ విజయాన్ని కాంక్షిస్తూ ఎంపీ నామ సోమవారం ఆయా డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి తెరాసకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
కార్యకర్తలే పునాధులు
ఏ ఎన్నికలు వచ్చినా కార్యకర్తలే పార్టీ విజయానికి పునాధులు, సారధులని ఎంపీ నామ అన్నారు. వారు లేనిదే పార్టీ, తాను లేనన్నారు. సీఎం కేసీఆర్ కార్యకర్తలకు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే... నేడు ఏ ఎన్నిక వచ్చినా తెరాసదే గెలుపు అవుతుందన్నారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ది, సంక్షేమం కేవలం ఏడు సంవత్సరాల్లోనే చేసి చూపించామన్నారు. 2015లో సీఎం కేసీఆర్ ఖమ్మం వచ్చి, ఖమ్మం నగరం తిరిగారని, అప్పుడే ఖమ్మం అభివృద్ధికి భీజం పడిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖమ్మం ఎంత అభివృద్ధి సాధించిందో మనందరికీ తెలిసిందేనన్నారు. పార్టీ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించుకుంటే మరింత అభివృద్ధికి సాధ్యమవుతుందన్నారు. సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లి, ప్రచారం చేసి, ప్రతి ఓటరును తీసుకొచ్చి ఓటు వేయించుకోవాలన్నారు.
ఇప్పుడు పరిస్థితి వేరు
దేశంలో ఏ రాష్ట్రలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు. తాను ఈ విషయం పార్లమెంట్‌లో చెబితే మిగతా రాష్ట్రాల ఎంపీలు ఎలా సాధ్యమవుతుందంటూ ఆశ్చర్యపోయారని పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం తాగునీరు, సాగునీరు, కరెంట్ కొరత ఉండేదని, ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకునే వారమని, కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు, అన్నీ పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. రైతు బంధు, కల్యాణ లక్షీ, షాదీ ముబారక్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.