ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టును బేతుపల్లి చెరువుకు అనుసంధానించామని... దీనివల్ల సత్తుపల్లిలో నీటి సమస్య తీరనుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఈ అనుసంధానం వల్ల సాగర్ కాల్వలకు, చెరువులకు, కుంటలకు గోదావరి జలాలు రానుండడం వల్ల సత్తుపల్లి సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. జిల్లాలోని పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో జరుగుతున్న 360 కిలోమీటర్ల కాలువ పూడికతీత పనులను కలెక్టర్ కర్ణన్తో కలిసి ఆయన పరిశీలించారు.
కలెక్టర్ సహకారంతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి ప్రయోగాత్మకంగా 23 కిలోమీటర్ల మేర పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం అవడం వల్ల రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారన్నారు. సత్తుపల్లి మండలం నారాయణపురం పంట కాలువ, బేతుపల్లి చెరువు గట్టుపై హరితహారం కార్యక్రమం లో భాగంగా కలెక్టర్, ఎమ్మెల్యే మొక్కలు నాటారు.