ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు, దేశానికి సేవ చేసేలా రాజకీయాలు ఉండాలని కక్షపూరిత, విధ్వంసకర రాజకీయాలు తగవని కేంద్ర ఐటీ, సిల్క్ డెవలప్మెంట్ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ భాజపా నాయకుడు సాయిగణేశ్ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. మృతుడి అమ్మమ్మ సావిత్రి, సోదరి కావేరిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
యువ కార్యకర్త సాయిగణేశ్ ఆత్మహత్య ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడు బలవన్మరణానికి పాల్పడాల్సి రావడం విచారకరమని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని రాజీవ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
అంతకుముందు సాయిగణేశ్ కుటుంబసభ్యులను ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా లేకుండా పోయాయని ఆరోపించారు. కేసీఆర్, తెరాస ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని వ్యాఖ్యానించారు. తెరాస ప్రభుత్వ అరాచకాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని విమర్శించారు. అధికార దర్పం ప్రదర్శించిన ఎందరో కాలగర్భంలో కలిసిపోయారని తెరాసకు అదే గతిపడుతుందని జోస్యం చెప్పారు.
సాయిగణేశ్‌పై అనేక కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేశారని ఈటల ఆరోపించారు. చనిపోతూ వీడియో వాంగ్మూలం ఇచ్చినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. తెరాసలో సొంతపార్టీ నేతలకు వేధింపులు, కేసులు తప్పడం లేదని అన్నారు. సాయిగణేశ్ మృతిపై కేంద్ర ప్రభుత్వమే సీబీఐ విచారణ జరపాలని కోరతామన్నారు. రాబోయే రోజుల్లో తెరాస అరాచకాలపై భాజపా పోరాటం కొనసాగిస్తుందని ఈటల స్పష్టం చేశారు.
"ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వం కేసీఆర్‌ది. కానీ గత మూడు సంవత్సరాలుగా కేసీఆర్ ప్రజాస్వామ్యంలో ఉన్నట్లు భావించడం లేదు. కేసీఆర్ వారసత్వంగా అధికారం వచ్చిన నిజాం వారసుడిగా ప్రవర్తిస్తున్నారు. అన్ని జిల్లాలో తన ప్రత్యర్థి పార్టీలను వేధించడం. వారిపై అక్రమ కేసులు పెట్టడం. ఆర్థికంగా దెబ్బతీయడం వారిని తన దారిలోకి తెచ్చుకోవడం. అధికారం చలాయిచడం కేసీఆర్ నైజంగా మారింది. సాయిగణేశ్ భాజపాలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. అందుకే అతనిపై 16 కేసులు పెట్టారు. ఎక్కడ మంత్రులు ఈ జిల్లా పర్యటనకు వచ్చినా ముందస్తు అరెస్ట్ చేసేవారు. చివరికి వేధింపులు తట్టులేక ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోతూ వీడియో వాంగ్మూలం ఇచ్చినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. ఖమ్మం, రామాయంపేట, కొత్తగూడెం ఘటనలపై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశించాలని కోరతాం." -ఈటల రాజేందర్ ఎమ్మెల్యే
ఇదీ చదవండి: BJP Protest: రాష్ట్రవ్యాప్తంగా భాజపా ఆందోళనలు.. పలుచోట్ల ఉద్రిక్తత..
డబ్ల్యూహెచ్ఓ బాస్‌కు మోదీ 'నామకరణం'.. కొత్త పేరు ఏంటంటే...