ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి... మిర్చి, కంది పంటలు తడిసిముద్దయ్యాయి. కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ఖమ్మం గ్రామీణ మండలంతో పాటు.. ముదిగొండ మండలాల్లో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంట.. వరదకు కొట్టుకుపోయింది.
ఖమ్మంలో అకాల వర్షానికి నీటి పాలైన మిర్చిపంట
అకాల వర్షాలతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని మిర్చి రైతులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లాలో కురిసిన అకాల వర్షం వల్ల నేలగొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్ సహా పరిసర మండలాల్లోని మిర్చి పంట తడిసి ముద్దయింది.
పాలేరు నియోజకవర్గంలో సుమారు 11 వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటను... స్థానిక శాసనసభ్యుడు కందాల ఉపేందర్‌రెడ్డి పరిశీలించారు. మిర్చి, కంది పంటలు బాగా దెబ్బతినటంపై... ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు పంట నష్టంపై ఆరా తీయాలని ఆదేశించారు.
ఆరుగాలం శ్రమించి అష్టకష్టాలుపడి పండించిన పంట.. తడిసి ముద్ద కావడం వల్ల రైతులు కన్నీటి పర్యంతం అయ్యారు. తడిసిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని.. మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పించాలని అన్నదాతలు విజ్ఞప్తి చేశారు.