Mirchi Crop Price Telangana 2024 :సీజన్ ఆరంభంలో ఖమ్మం మిర్చి మార్కెట్‌లో ధరల దగా అన్నదాతకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. సీజన్ ఆరంభం నుంచి అనేక కష్టాలు నష్టాలే మిర్చి రైతును వెంటాడుతున్నాయి. అధిక వర్షాలు, తెగుళ్లతో దిగబడులు గణనీయంగా తగ్గగా పంట చేతికొచ్చే సమయంలో మిగ్జాం తుపాను రైతుల్ని నట్టేటముంచింది. మిగిలిన కొద్ది పంటను తీసుకొచ్చిన కర్షకులను మార్కెట్ మాయాజాలం నిండా ముంచుతోంది.
ఈయన పేరు వెంకట్ రెడ్డి తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు. ఎకరంలో మిర్చి సాగు చేశారు. 8బస్తాల దిగుబడిరాగా అమ్ముకునేందుకు మార్కెట్‌కు తీసుకొచ్చాడు. మార్కెట్‌లో జెండాపాట రూ.23 వేల 150 పలకగా, వ్యాపారులు మాత్రం రూ.13 నుంచి రూ.14 వేలకు మించి అడగలేదు. అంత తక్కువకు ఇవ్వనని చెప్పిన అతను మూడ్రోజులుగా అక్కడే పడిగాపులు పడుతున్నాడు. మార్కెట్‌లో పేరుకే జెండా పాటలున్నాయని, దారుణంగా తగ్గించి కొంటున్నారని వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
Khammam Mirchi Market: మిర్చి రైతుల కష్టాలు తీరేదెన్నడు...?
15 రోజులుగా ఖమ్మం మార్కెట్‌కి రైతులు మిర్చి తీసుకొస్తున్నారు. వారం నుంచి రోజుకు 10వేల బస్తాలకుపైగానే వస్తోంది. గురువారం దాదాపు 15 వేల బస్తాల వరకు తీసుకొచ్చారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుల్ని నిండా ముంచుతున్నారు. వాస్తవానికి గురువారం మార్కెట్‌లో ఎండు మిర్చి జెండాపాట రూ.23వేల 150 గా నిర్ణయించగా రైతులు సంబరపడ్డారు. తీరా కొనుగోళ్లు మొదలయ్యాక వ్యాపారుల మాయాజాలం బయటపడింది.
"జెండా పాట చూసి ఇక్కడికి వచ్చాం. అది 23వేలు ఉంటే ఇక్కడ మాత్రం 16 వేలు మాత్రమే తీసుకుంటున్నారు. కనీసం గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. ఇలాగే తక్కువ ధరకు అమ్మితే మాకు పురుగుల మందే దిక్కు." - రైతులు