'తెలంగాణ నీటి వాటా దోచుకునేవాళ్లను దొంగలే అంటారు' తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను కేంద్రం ప్రశంసిస్తుందే తప్ప రాష్ట్రాభివృద్ధికి మాత్రం పైసా సహకారం అందించడం లేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పల్లెప్రగతి ముగింపు కార్యక్రమాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలను నేతలు ప్రారంభించారు.
త్వరలోనే పింఛన్లు...
భాజపా పాలిత రాష్ట్రాల్లోనూ ధాన్యం కొనుగోళ్లు అంతంతమాత్రంగానే సాగాయన్న మంత్రి.. సీఎం కేసీఆర్ సంకల్పంతో తెలంగాణలో రైతు పండించిన ప్రతీ ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్రం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను కేంద్రం అనుసరిస్తుందన్నారు. పల్లెప్రగతి కార్యక్రమాన్ని దేశంలోని పలు రాష్ట్రాలు అమలు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కరోనా కష్టకాలంలో అన్ని రాష్ట్రాలు పింఛన్లు ఆపినా.. మనం మాత్రం ఒక్కరికి కూడా ఆపలేదు. ఆర్థిక వ్యవస్థ డీలాపడినా.. రైతుబంధు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. త్వరలోనే 57 ఏళ్లు పైబడిన వారికి పింఛన్లు ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని.. సర్వే పూర్తయిన వెంటనే అందిస్తామన్నారు.
ఇదే స్ఫూర్తి కొనసాగించాలి...
"రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పల్లె ప్రగతి విజయవంతమైంది. పల్లె ప్రకృతివనాలు, వైకుంఠథామాల నిర్మాణాల్లో రాష్ట్రంలోనే.. సత్తుపల్లి నియోజకవర్గం ఆదర్శంగా నిలిచింది. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు, జిల్లా అధికారులకు అభినందనలు. 10 రోజుల పాటు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పల్లెల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పల్లె ప్రగతి స్ఫూర్తిని అధికారులు, ప్రజాప్రతినిధులు కొనసాగించాలి. పంచాయతీ కార్యదర్శుల జీతాలు, ఇతర సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తాం."- ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి.
చూస్తూ ఊరుకోం...
"తెలంగాణ నీటి వాటాను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న వారు దొరలెలా అవుతారు. వాళ్లను దొంగలే అంటాం. కృష్ణాబేసిన్‌లో రాష్ట్ర నీటి వాటా కోసం ఎంతవరకైనా పోరాడతాం. తెలంగాణకు వైఎస్సార్ అన్యాయం చేసిన విధంగానే ఏపీ సీఎం జగన్ కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం తెస్తామంటే చూస్తూ ఊరుకోం. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు సమయంలో.. మహారాష్ట్ర ప్రభుత్వంతో సీఎం కేసీఆర్ అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఏపీ అధికారులు, నేతలు వక్రీకరించి నీళ్లు ఇస్తామన్నట్టు వాళ్ల సీఎంకు చెప్పుకున్నారు. తెలంగాణ హక్కుగా వచ్చే ఒక్క నీటి బొట్టును కూడా పక్కకు పోకుండా పోరాడతాం. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాను సశ్యశ్యామలం చేసేందుకు కృషిచేస్తాం."- పువ్వాడ అజయ్‌కుమార్, రవాణాశాఖ మంత్రి