Minister Srinivas Goud: ఖమ్మం జిల్లాలో పర్యాటకరంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి వైరాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
వైరా ప్రధాన కూడలిలో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రులు షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. వైరా జలాశయంలో బోట్ షికారు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ తాతా మధు, కలెక్టర్ గౌతం బోటు షికారు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
బోటు షికారు చేస్తున్న మంత్రి వైరా జలాశయం వందేళ్ల చరిత్ర ఉన్న నేటికీ అభివృద్ధికి నోచుకోలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రిజర్వాయర్‌గా చూశారే తప్ప పర్యాటకంగా అభివృద్ధి చేయలేదని మంత్రి పేర్కొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే రాములు నాయక్ ఈ ప్రాంత అభివృద్ధిపై సీఎం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఇండోర్ స్టేడియంలో క్రీడలకు అవసరమైన మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
జలాశయం వద్ద ప్రస్తుతం ఉన్న రెండు బోట్లకు తోడుగా 50 సీట్ల సామర్థ్యం ఉన్న మరో బోటును అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్, ఖమ్మం ప్రాంతాలనుంచి పర్యాటకులు వచ్చి ఇక్కడ బస చేసే విధంగా సదుపాయాలు ఏర్పాట్లు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
వైరాలో పర్యటించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్ ఎదుట ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు ఆందోళన నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రుల ప్రసంగాన్ని అడ్డుకొని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వైరాలో ఇండోర్ స్టేడియం ప్రారంభించి సభా వేదిక వద్దకు చేరుకున్న మంత్రులు సభలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా అడ్డుకున్నారు. ప్ల కార్డులతో సభా వేదిక వద్దకు దూసుకొని వచ్చిన క్షేత్ర సహాయకులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతుండగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
తమను విధుల్లోకి తీసుకోవాలని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దండాలు పెడుతూ నిరసన తెలిపారు. ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు ఆందోళనకారులను పక్కకు నెట్టేశారు. అనంతరం మంత్రులు ప్రజా ప్రతినిధులు స్టేడియం నుంచి బయటికి వెళ్లారు.
ఇదీ చదవండి: Thummala: తెరాసకు రెబల్‌గా మారాల్సిన అవసరం లేదు: తుమ్మల