పోడు భూముల సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పరిష్కరిస్తారని మంత్రి సత్యవతి రాఠోడ్ శాసనసభలో తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు సీతక్క, భట్టి విక్రమార్క ప్రశ్నలకు.. మంత్రి సమాధానమిచ్చారు. 2008 నుంచి 33,970 ఎకరాలకు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం వర్తింప జేస్తూ అర్హులైన హక్కుదారులకు 94,774 పట్టాలు అందజేశామని మంత్రి వివరించారు.
'ఆ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు'
పోడు భూముల సమస్య పరిష్కరించాలని అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు. ఆ సమస్యను త్వరలోనే సీఎం కేసీఆర్ స్వయంగా పరిష్కరిస్తారని చెప్పారు. పోడు భూముల సాగు విషయంలో కొందరు అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఆర్ఓఎఫ్ఆర్ చట్టం చేసినప్పటి నుంచి 6,31,850 ఎకరాలకు సంబంధించి లక్షా 84 వేల 730 ఫిర్యాదులు అందాయన్నారు. క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి పరిష్కరిస్తున్నామని మంత్రి సత్యవతి రాఠోడ్ అసెంబ్లీలో తెలిపారు. పోడు భూములు సాగుచేసుకోనియ్యకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకురాగా.. యథాతథ స్థితి ఉండాలని స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినా కొందరు అటవీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మంత్రి సత్యవతి రాఠోడ్ సభకు వివరించారు.
ఇదీ చూడండి :'ఆధునిక పద్ధతిలో వ్యవసాయానికి రైతు వేదికల నిర్మాణం'