ప్రజల భాగస్వామ్యం, చైతన్యంతోనే రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు, వేగ నియంత్రణ పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. 32 వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. హెల్మెట్ ధరించి స్వయంగా బైక్ నడుపుతూ నగరంలోని ప్రధాన రహదారులపై ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
అజాగ్రత్త వద్దు
అంతర్జాతీయంగా పోలిస్తే దేశంలో వాహనాల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ.. మరణాల శాతం మాత్రం మనదేశంలోనే ఉండటం అత్యంత దురదృష్టకరమని పువ్వాడ అన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే ప్రమాదాలకు కారణమవుతుందన్నారు. చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. గమ్యం చేరేందుకు గంట సమయం పడుతుందని వేగంగా బయలుదేరుతామని... కానీ ప్రాణాలు పోవడానికి ఒక్క క్షణం చాలన్న సంగతి వాహనదారులు గుర్తుంచుకోవాలని మంత్రి సూచించారు. రోడ్డు ప్రమాదంలో పెద్దదిక్కు మరణిస్తే..ఆ కుటుంబం చిన్నాభిన్నమవుతుందన్నారు.