పోడు సాగుదారులకు హక్కులు కల్పించడంతోపాటు.. పోడు పేరిట సాగుతున్న అటవీ భూముల ఆక్రమణలకు చెక్ పెట్టేందుకు తెరాస ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయంలో పోడు భూముల సమస్యలు, అడవుల పరిరక్షణపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిపక్షాలు సూచించిన ప్రతీ అంశాన్ని పరిగణలోకి తీసుకొని అందరి భాగస్వామ్యంతోనే పోడుభూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి అన్నారు.
గత ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యలు చేపట్టినా.. గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రస్థాయిలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని తెలిపారు. గతంలో వచ్చిన పోడు దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించలేదని పేర్కొన్నారు. పోడు భూముల్లో గిరిజనుల పేరుతో గిరిజనేతరుల ఆగడాలు మాత్రం సాగనివ్వబోమన్నారు.