Puvvada on polavaram: పోలవరం ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ముంపునకు గురవుతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరద తగ్గకపోవడంతో ముంపు ప్రాంతాలు మరింత పెరిగే అవకాశముందని తేలిందన్నారు. ముందుగా ప్రతిపాదించినట్లు పోలవరం ప్రాజెక్టులో 36 లక్షల క్యూసెక్కులు నీటి నిలువ సామర్థ్యం ఉంటుందని భావించినట్లు వెల్లడించారు. కానీ ఇప్పుడు కాఫర్ డ్యాం కూడా కాంక్రీట్‌తో నిర్మించేలా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని పేర్కొన్నారు.
పోలవరం వల్ల మరింత ముప్పు ఏర్పడే ప్రమాదముంది. భద్రాద్రి రామయ్య ఆలయం కూడా మునిగిపోయే అవకాశముంది. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు మాకు సహకరించాలి. పోలవరంపై కేంద్రం మరోసారి అధ్యయనం చేయాలి. సాధ్యమైనంత త్వరగా ఐదు గ్రామాలు తెలంగాణలో కలపాలి. రెండు రాష్ట్రాలకు ఇష్ట దేవుడైన భద్రాచలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.- పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి