Puvvada Ajay Kumar: దేశాన్ని పరిపాలించేందుకు ఆదర్శంగా చూపించిన గుజరాత్ మోడల్ ఫెయిల్యూర్ మోడల్ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ మోడల్ గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని తెలిపారు. తెరాసను భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతూ చేసిన తీర్మానంలో తామంతా భాగస్వాములవటం అదృష్టంగా భావిస్తున్నామని పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ అవసరం ఎంతైనా ఉందని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధితో పాటు దేశ రాజకీయాలు సైతం కొత్త మలుపు తిరుగబోతుందని చెప్పారు. దేశంలో తెలంగాణలో రైతులు, పేదలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఆరాతీస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టిస్తున్న పార్టీలకు తగిన బుద్ది చెబుతామని పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.
"ఒకప్పుడు కృత్రిమ గుజరాత్ మోడల్‌ను ప్రజల ముందు పెట్టి దేశంలో పరిపాలన కోసం గుజరాత్ అంతా ఏదో గొప్పగా అయిపోయిందని చెప్పారు. కానీ ఇప్పటి కూడా అక్కడ కరెంట్, నీటికి ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి గుజరాత్ మోడల్ ఫెయిల్యూర్ మోడల్. తెలంగాణ మోడల్ సక్సెస్ మోడల్. ఆ మోడల్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అలాంటి చారిత్రాత్మక తీర్మానం చేసిన సమయంలో తెరాసను జాతీయ పార్టీగా ముందుగా తీసుకెళ్లాలనే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. తెలంగాణకు సీఎంగా ఉంటూనే కేసీఆర్ దేశ రాజకీయాల వైపు అడుగులు వేస్తారు." - పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి