Minister Puvvada Counter to Ponguleti : రాబోయే ఎన్నికల్లో ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను ఇంటికి సాగనంపడం ఖాయమని.. ఆయన దోపిడీ ప్రజలకు తెలుసన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డబ్బు బలం చూసుకుని విర్రవీగుతున్నారని దుయ్యబట్టారు. ఏ పార్టీలోకి పోవాలో తేల్చుకోలేని దుస్థితిలో పొంగులేటి ఉన్నారన్న మంత్రి.. శ్రీనివాస్‌రెడ్డి ఓ సిద్ధాంతం, విలువ లేని నేత అని పేర్కొన్నారు. ఆయన తనను తాను అతిగా ఊహించుకుంటున్నారని అన్నారు.
Puvvada Latest Counter to Ponguleti Srinivas : ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక బచ్చా అని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. పేదలను పీడించిన దోపిడీ దారులే పొంగులేటి పంచన చేరారని.. కాంట్రాక్టులు చేసుకుని ఒక్కడు బాగుపడితే జిల్లా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పొంగులేటి గతంలో బీఆర్‌ఎస్‌లో ఉండి సొంత పార్టీ నేతలనే ఓడించాలని కుట్ర చేశారన్న ఆరోపించిన పువ్వాడ.. పద్ధతి మార్చుకోవాలని సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు చెప్పినా పొంగులేటి మారలేదన్నారు.
''పొంగులేటి డబ్బు బలం చూసుకుని విర్రవీగుతున్నారు. ఏ పార్టీలోకి పోవాలో తేల్చుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఆయన ఓ సిద్ధాంతం లేని, విలువ లేని నేత. తనను తాను అతిగా ఊహించుకుంటున్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి ఒక బచ్చా. బీఆర్‌ఎస్‌లో ఉండి సొంత పార్టీ నేతలనే ఓడించాలని కుట్ర చేశారు. పద్ధతి మార్చుకోవాలని సీఎం ఎన్నిసార్లు చెప్పినా పొంగులేటి మారలేదు.'' - పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి
ఇంతకీ పొంగులేటి ఏమన్నారంటే.. : రాబోయే నాలుగైదు నెలలు ఎన్ని కష్టనష్టాలైనా భరించి.. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యమని పొంగులేటి స్పష్టం చేశారు. రూ.వేల కోట్ల అక్రమ సంపాదన కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన కేసీఆర్ కుటుంబ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటామని అన్నారు.