Puvvada Ajay on Revanth reddy: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్‌లు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఎంబీబీఎస్ సీట్ల ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తానన్న రేవంత్‌రెడ్డి.. ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిని వచ్చారని ఎద్దేవా చేశారు. ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు పువ్వాడ, కొప్పులఈశ్వర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
'వచ్చిందేమో రాహుల్ గాంధీ సభకు.. కానీ నా స్మరణ ఎక్కువగా చేశారు. రేవంత్ అలావాటు ఎందంటే బట్ట కాల్చి మొఖం వేయడం. దులుపుకో లేకపోతే కాల్చుకో అన్న తీరు. నువ్వేదో సీబీఐ, ఎంసీఐ, ఐక్యరాజ్యసమితిని తెచ్చుకుంటావా తెచ్చుకో. నీలాంటోళ్లను చాలామందిని చూశా. ఎంసీఐని తెచ్చుకోండి. మీరేం చేసుకుంటారో చేసుకోండి. నాది 25 ఏళ్ల సంస్థ. ఇలాంటి ఆరోపణలు చేస్తే తీవ్రమైన పరిణామాలు తప్పవు. పువ్వాడ అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా? ఫైర్ ఉంది ఇక్కడ. ఆ విషయం వాళ్లకు తెల్వట్లేదు.' - పువ్వాడ అజయ్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి
2018 ఎన్నికల్లో కమ్మ కులానికి ఒక్క సీటు ఇవ్వని కాంగ్రెస్ నేతలు మాట్లాడడం సిగ్గుచేటని పువ్వాడ అన్నారు. తనను బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలు గుండెల్లో పెట్టుకుని రెండుసార్లు గెలిపించారని తెలిపారు. ఖమ్మంలో సాయిగణేశ్ ఆత్మహత్య కేసు న్యాయస్థానంలో ఉన్నందున ఈ నెల 29 తర్వాత స్పందిస్తానన్నారు. తెరాసకు ఉన్న ఆదరణ తట్టుకోలేకే కాంగ్రెస్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేసుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్ అనేక మంది ఉద్యమకారులపై కేసులు పెట్టిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ నేతలకు కళ్లు మూసిన తెరిచినా తానే కనిపిస్తున్నానని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. బట్ట కాల్చి మీదవేయడం రేవంత్ రెడ్డికి అలవాటన్నారు. 2018 ఎన్నికల్లో కొండగల్ ఎన్నికల్లో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తాన్న రేవంత్ రెడ్డి... ఆ మాటకు కట్టుబడి ఉండకుండా ఇంకా ఎందుకు రాజకీయాల్లో ఉన్నారని ప్రశ్నించారు. తన కళాశాలలో సీట్లపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారని.. అది నిరూపిస్తే ప్రభుత్వానికి కళాశాలను అప్పగిస్తానని చెప్పడంతో ఇప్పుడు మరో కొత్త అంశంతో వస్తున్నారని మండిపడ్డారు.