ఖమ్మం జిల్లాలో పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో అత్యధికంగా వరి సాగవుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సిద్దారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ప్రకృతి వనాన్ని,శ్మశాన వాటికను మంత్రి.. ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ప్రారంభించారు. ఖరీఫ్ లో పండిన ధాన్యాన్ని దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇక్కడి మిల్లర్లే కొనుగోలు చేస్తారన్నారు. ఈసారి రాష్ట్రంలో గన్ని సంచుల కొరత లేదన్నారు. మరో 30 లక్షల వరకు టెండర్ దాఖలు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో వేల కోట్లు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులు రాష్ట్రంలో అమలు కావని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిలో సత్తుపల్లి నియోజకవర్గం అగ్రగామిగా ఉందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. జాతీయ రహదారి మరమ్మతులకు 25 కోట్లు నిధులు మంజూరయ్యాయని సండ్ర వెల్లడించారు.