ఖమ్మంలో త్వరలో జరిగే నగరపాలక సంస్థ ఎన్నికల్లో అసలైన వ్యాక్సిన్ దెబ్బ రుచిని భాజపాకు చూపిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. ఖమ్మం పర్యటనలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ఇప్పటి వరకు తనకు అవినీతి మరక అంటుకోలేదని... భవిష్యత్ లోనూ అంటుకోదని స్పష్టం చేశారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమని అన్నారు. ఖమ్మం ఎన్‌ఎస్‌పీ క్యాంపులో సమీకృత మార్కెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఎన్నికల సమయంలో రాజకీయ పర్యటకులు వస్తుంటారని... భాజపా నేతలు వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో కలిపినందుకు భాజపా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఏపీకి అప్పనంగా అప్పగించారని ఆరోపించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ఇప్పటివరకు స్పందనే లేదన్నారు.