Minister KTR Roadshow at Khammam : శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే భద్రాచలంలో గోదారి వరదలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం, ఇల్లందు రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్.. కాంగ్రెస్ ఓట్లేసి ఆగమాగం కావద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం(Election War) మమ్మల్ని చేయమంటే ఎలా.. కాంగ్రెస్‌కు ఓట్లు వేసి మమ్మల్ని అభివృద్ధి చేయమంటే ఎలా అని ప్రశ్నించారు. ఎన్నికల వేళ ప్రజలు డబ్బులకు అమ్ముడుపోకుండా గులాబీ అభ్యర్థులను గెలిపించుకోవాలని తెలిపారు.
నేను రష్మిక అంత ఫేమస్ కాదు - డీప్ ఫేక్ మహిళలకే కాదు, రాజకీయ నాయకులకూ ప్రమాదకరం : కేటీఆర్
భద్రాచలం వచ్చినప్పుడు కచ్చితంగా రాముని వారి పాదాలకి నమస్కరించాలని అనుకున్నానని.. అధికారుల విజ్ఞప్తి మేరకు ఆలయానికి వెళ్లలేదని మంత్రి తెలిపారు. కానీ మరొక పది రోజుల తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి వారం రోజులు ప్రశాంతంగా రాముని దర్శించుకుంటానని మాట ఇస్తున్నానని అన్నారు. గతంలో భద్రాచలంలో కరెంటు పరిస్థితి, సాగుబడి పరిస్థితి ఎలా ఉంది.. ఇప్పుడు సీఎం కేసీఆర్(CM KCR) పాలన తర్వాత ఎలా ఉందని ప్రశ్నించారు. ఇక్కడ జరుగుతున్న అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయని వివరించారు.
యాదాద్రి కంటే గొప్పగా భద్రాచలం రామాలయ అభివృద్ధి :రాష్ట్రంలో మరోసారి రాబోయేది తమ ప్రభుత్వమేనని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌నే అని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కారణాలు ఏవైనప్పటికీ ఖమ్మం ప్రజలు తమకు అవకాశం ఇవ్వలేదు.. కానీ ఈసారి మాత్రం కచ్చితంగా గులాబీ వనంలో భద్రాచలం చేరాలని.. కారు గుర్తు అభ్యర్థి గెలవాలని కేటీఆర్ కోరారు. యాదాద్రి కంటే గొప్పగా భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు. గత రెండు పర్యాయాలు తమ అభ్యర్థిని గెలిపించక పోయినప్పటికీ కొన్ని కార్యక్రమాలు చేశామన్ని మంత్రి.. ఈసారి పూర్తిస్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
మాకు రాములావారి మీద చిన్న చూపు కాదు. అపారమైన భక్తి, ప్రేమ ఉంది. నేను మీకు మాట ఇస్తున్నా.. ఇవాళ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఎంతైతే అభివృద్ధి చేసుకున్నామో, అంతే గొప్పగా ఇక్కడ రాములవారి థీమ్ పార్క్‌ను, భద్రాద్రి గుడిని బ్రహ్మాండంగా చేసుకుందాం. గత ఎన్నికల్లో రెండు పర్యాయాలు మా అభ్యర్థిని మీరు గెలిపించకుపోయినా.. కొన్ని పనులను చేశాం. ఇంకా ముఖ్యమైన పనులు చేయాలంటే తప్పకుండా రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ కాబట్టి.. ఇక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుంది.-కేటీఆర్, రాష్ట్ర మంత్రి