కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధుకు రూ.500 కోట్ల నిధులను విడుదల చేస్తూ.. జీవోను ఇవ్వటంపై సీఎం కేసీఆర్కు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. దేశంలోనే దళిత బంధు ఒక వినూత్నమైన పథకమని మంత్రి కొనియాడారు. గత ప్రభుత్వాలు దళితులను ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా దళితుల గురించి ఆలోచించిన ప్రభుత్వాలు లేవని మంత్రి అన్నారు. గత పాలకులు దళితులను కేవలం ఓటు బ్యాంకు కోసం మాత్రమే వాడుకున్నారని విమర్శించారు. దళితుల అభ్యన్నతి కోసమే ఈ పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టామని వెల్లడించారు. దళిత బంధు పథకం ఒక సాహసోపేతమైన నిర్ణయమని వ్యాఖ్యానించారు.