తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశ రాజకీయాలను మలుపు తిప్పేదిగా ఖమ్మం సభ.. షెడ్యూల్​ ఇదే: మంత్రి హరీశ్​రావు - ఖమ్మం సభ చారిత్రక సభ

Harishrao on Khammam BRS Public Meeting : ఖమ్మంలో బీఆర్​ఎస్​ ఆవిర్భావ సభ చరిత్రాత్మకం అవుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన.. దేశ రాజకీయాలను మలుపు తిప్పేది అవుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధితో మూడోసారి బీఆర్​ఎస్సే అధికారంలోకి వస్తుందని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.

Harishrao
Harishrao

By

Published : Jan 16, 2023, 6:48 PM IST

Harishrao on Khammam BRS Public Meeting : ఖమ్మం బీఆర్​ఎస్ బహిరంగ సభ కోసం పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాది మంది తరలివచ్చినా.. ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు తగు చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్​ఎస్ బహిరంగ సభకు ఖమ్మం నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎంపీలు నామ నాగేశ్వరరావు, రవిచంద్ర, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.

వచ్చే ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగరటం ఖాయం: అభివృద్ధిలో ఖమ్మం యావత్‌ తెలంగాణకు ఆదర్శమని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. సభకు ఐదు లక్షల మంది తరలివచ్చేలా ప్రతీ కార్యకర్త చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. విపక్షాల్లో కాంగ్రెస్‌ ఖాళీ అయిపోయిందని.. మతతత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగరటం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం నగరాన్ని చూసే.. సిద్దిపేటను అభివృద్ధి చేశామన్నారు.ఖమ్మంలో ఏర్పాటు చేస్తున్న బీఆర్​ఎస్​ బహిరంగ సభకు 13 నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

దేశ రాజకీయాలను మలుపు తిప్పే సభ:ఈనెల 18న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుందని హరీశ్​రావు తెలిపారు. ఖమ్మంలో బీఆర్​ఎస్ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఈ భారీ బహిరంగ సభ దేశ రాజకీయాలను మలుపు తిప్పే సభగా మారుతుందని మంత్రి పునరుద్ఘాటించారు. వంద ఎకరాల్లో సభను ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి హరీశ్​రావు.. కార్యకర్తల కోసం పొరుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు సభ నిర్వహణ, సీఎం కార్యక్రమాల గురించి ఆయన ఖమ్మంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు.

'ఎల్లుండి ఉదయం ప్రగతిభవన్‌లో జాతీయ నాయకులతో బీఆర్​ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్చలు జరుపుతారు. అక్కడి నుంచి నేరుగా యాదాద్రి చేరుకుని లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం రెండు హెలికాప్టర్లలో ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకుంటారు. ఖమ్మంలోని నూతన కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. తెలంగాణకు ముఖ్య అతిథులుగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.'- హరీశ్​రావు, ఆర్థిక శాఖ మంత్రి

దేశ రాజకీయాలను మలుపు తిప్పే సభ: మంత్రి హరీశ్‌రావు

ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ షెడ్యూల్ ఇదే..

  • 17 రాత్రికి జాతీయ నేతలంతా హైదరాబాద్‌ చేరుకుంటారు.
  • యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్​కు మంత్రి తలసాని స్వాగతం పలుకుతారు.
  • దిల్లీ సీఎం కేజ్రీవాల్​, పంజాబ్ సీఎం భగవంత్​సింగ్ మాన్​కు మంత్రి మహమూద్‌ అలీ స్వాగతం చెబుతారు. ప్రొటోకాల్ చూస్తారు.
  • కేరళ సీఎం పినరయి విజయన్​కు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీపీఐ జాతీయ నేత డి.రాజాకు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్‌ స్వాగతం పలుకుతారు.
  • 18న ఉదయం జాతీయ నేతలంతా సీఎం కేసీఆర్​తో బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తారు. అనంతరం వారంతా దేశ రాజకీయాలపై చర్చిస్తారు.
  • ఆ తర్వాత సీఎం కేసీఆర్​తో కలిసి వారంతా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు.
  • యాదాద్రి నుంచి రెండు హెలికాప్టర్లలో ఖమ్మం బయలుదేరుతారు.
  • నేరుగా సీఎం కేసీఆర్​తో కలిసి వారంతా ఖమ్మం కలెక్టరేట్‌ చేరుకొని, రాష్ట్రంలో చేపట్టే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
  • ఖమ్మం సభా వేదిక ముందు ప్రధాన నాయకులకు ప్రత్యేక సెక్టార్‌ ఉంటుంది.
  • మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు సభా వేదిక ముందు ఆసీనులవుతారు.
  • సీఎం కేసీఆర్​తో సభా వేదికపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలే ఉంటారు.
  • మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ సభ జరుగుతుంది.

బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కోసం అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభకు భారీగా తరలివచ్చే కార్యకర్తలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా.. మొత్తం సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో సుమారు 240 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details