Minister Harish Rao Interview : టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా కరీంనగర్‌లో నిర్వహించిన మొదటి బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికి ప్రత్యేక తెలంగాణ అవతరించగా.. ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ జాతీయ రాజకీయాలను మలుపు తిప్పనుందని మంత్రి, బహిరంగ సభ ఇన్‌ఛార్జి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు.
విచ్ఛిన్నకర విధానాలు కలిగిన బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగనున్న ఈ సభ జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుందని పేర్కొన్నారు. ఈ నెల 18న నిర్వహించే భారీ బహిరంగ సభ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న హరీశ్‌రావు ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
ఖమ్మం సభ ప్రాధాన్యమేంటి?
ప్రత్యేక తెలంగాణ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) గత ఎనిమిదిన్నరేళ్లలో అనేక రంగాల్లో రాష్ట్రాన్ని ముందంజలో ఉంచింది. సంక్షేమం.. అభివృద్ధి.. రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చి పని చేసింది. ఫలితంగా తెలంగాణ ధాన్యాగారంగా మారింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తక్కువ సమయంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం. రైతులకు ఉచిత విద్యుత్తు, గృహాలు, పరిశ్రమలకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా, రైతులకు పెట్టుబడికోసం రైతుబంధు, పారిశామ్రికాభివృద్ధికి ప్రోత్సాహకాలతో అనేక అంతర్జాతీయ సంస్థల ఏర్పాటు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా చేపట్టింది. అభివృద్ధికి ఓ నమూనాను ఆచరణలో పెట్టి విజయవంతం చేసింది.
ఇలాంటి ప్రయోజనాలను దేశ ప్రజలందరికీ అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తలపెట్టిన భారీ బహిరంగసభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారు. కచ్చితంగా ఇది ఓ చరిత్రాత్మక సభ. దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలుకుతుందనడంలో సందేహం లేదు. తెలంగాణ తొలిదశ ఉద్యమం ఖమ్మం జిల్లాలో సింగరేణి కార్మికుల నుంచే ప్రారంభమైంది. కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసి ఖమ్మం ఆసుపత్రిలో ఉన్నప్పుడే ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. కేంద్రం ప్రకటన చేసింది. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు మలిదశ ఉద్యమం కూడా ఖమ్మం నుంచే ప్రారంభం కానుంది.
మోదీ ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందని బీజేపీ అంటోంది కదా?
ఏ వర్గం సంతృప్తిగా ఉందో చెప్పమనండి. బీఆర్ఎస్ రైతు అనుకూల విధానాలు అవలంబిస్తే, బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు చేపట్టింది. మనం పండించిన ధాన్యం కూడా కొనకుండా రైతులను వేధిస్తున్న పరిస్థితి ఉంది. కార్మిక, రైతు, యువత ఇలా అన్ని వర్గాలకు వ్యతిరేక విధానాలే.నిరుద్యోగ సమస్యను మరింత పెంచడం తప్ప.. తగ్గించడానికి కేంద్రం ఏం చేసింది?
దేశంలో మత చిచ్చు పెట్టడం, విచ్ఛిన్నకర రాజకీయాలు చేయడం, గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేసి రాష్ట్రాలను ఇబ్బందుల పాల్జేయడం..ఇలా చెప్పుకొంటూ పోతే కేంద్రానివి అన్నీ వైఫల్యాలే. అన్ని వ్యవస్థలను దుర్వినియోగపరిచి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోంది. ఈ విధానాలను జాతీయ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కేసీఆర్ నిర్ణయం తీసుకొని మొదటి అడుగుగా భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. ఈ సభ దేశానికి ఓ సంకేతం ఇస్తుందనడంలో సందేహం లేదు.