minister harish rao on hospitals: 'మారుమూల ప్రాంతంలో భారీ ఆస్పత్రి నిర్మించడం ఆనందదాయకం' ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురంలో శ్రీషిరిడీ సాయి జనమంగళం ట్రస్టు.. షిరిడీసాయి ఆస్పత్రి నిర్మించనుంది. నారాయణపురంలో నిర్మించనున్న షిరిడీ సాయి ఆస్పత్రి లోగో, మినీయేచర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్యమంత్రి హరీశ్‌రావు, డీఆర్‌డీవో ఛైర్మన్ సతీశ్‌రెడ్డి, తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, నటుడు మోహన్‌బాబు హాజరయ్యారు.
రాబోయే రోజుల్లో 4వేల పల్లె దవాఖానాలు
మారుమూల ప్రాంతంలో భారీ ఆస్పత్రి నిర్మించాలని శ్రీషిరిడీ సాయి జనమంగళం ట్రస్టు తలపెట్టడం ఆనందదాయకమని హరీశ్‌రావు అన్నారు. దేశంలో వైద్యం అనేది చాలా ఖరీదైనదిగా మారిందని మంత్రి వెల్లడించారు. భారతదేశంలో వైద్యం మీదే ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని హరీశ్‌రావు వివరించారు. ప్రభుత్వపరంగా ఆస్పత్రి నిర్మాణానికి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకట్రెండు గ్రామాలకు ఒక పల్లె దవాఖానా ఉండేలా.. రాష్ట్రంలో 4వేల పల్లె దవాఖానాలను రాబోయే రోజుల్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు సేవ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వైద్య విద్య ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 5 మెడికల్ కాలేజీలకు అదనంగా మరో 12 మెడికల్ కళాశాలలను తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. వైద్య విద్యపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రాష్ట్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఎంబీబీఎస్ సీట్లతో పాటు పీజీ సీట్లను పెంచామన్నారు. ఆనాడు ఉన్న 500 పీజీ సీట్లు ఉండగా.. ఇప్పుడు 900 ఉన్నాయన్నారు. వచ్చే అకాడమీ నాటికి ఆ సీట్లను 1200లకు పెంచుతామన్నారు.
మారుమూల ప్రాంతంలో భారీ ఆస్పత్రి నిర్మించాలని శ్రీషిరిడీ సాయి జనమంగళం ట్రస్టు తలపెట్టడం ఆనందదాయకం. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్రాణం మీదికి వచ్చేవరకు ఆస్పత్రికి వెళ్లని పరిస్థితి ఉంది. వ్యాధులను పూర్తిగా ముదిరే వరకు వేచి చూడకుండా ..ప్రాథమిక స్థాయిలో గుర్తించి చికిత్స చేసుకోవాలి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓ స్థాయి దాటిన తర్వాత దవాఖానాకు వచ్చే పరిస్థితి ఉంది. అందువల్ల ఒకట్రెండు గ్రామాలకు కలిపి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఉండే విధంగా రాష్ట్రంలో 4వేల పల్లె దవాఖానాలను రాబోయే రోజుల్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. -హరీశ్ రావు, ఆరోగ్య శాఖ మంత్రి
ఇదీ చదవండి:
Omicron Variant News: అత్యంత ప్రమాదకరంగా ఒమిక్రాన్.. ఇదే కారణం!