Harish Rao on Unemployment: భాజపా అబద్ధాల ప్రచారాన్ని నమ్మొద్దని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రమంత్రులు ప్రశంసించారని ఆయన గుర్తుచేశారు. భాజపా నేతలేమో గల్లీలో విమర్శలు చేస్తారని విమర్శించారు. రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నది భాజపాయే అని విమర్శించారు. గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకివ్వరని ప్రశ్నించారు. ఐటీఐఆర్ రద్దు చేసి, కోచ్ ఫ్యాక్టరీ ఎత్తుకు పోయారని ఆరోపించారు. తాము ఇప్పటికే 1,32,899 ఉద్యోగాలిచ్చామన్న హరీశ్... మరో 50, 60 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
కేంద్రంలో ఖాళీగా ఉన్న 15.62 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 2 కోట్ల మందికి ఉద్యోగాలిస్తామన్న ప్రధాని మోదీ... ఎన్ని ఇచ్చారని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలను అమ్ముతూ ఉద్యోగాలు పోగొట్టారని మండిపడ్డారు. బ్యాంకులు లూటీ అయి, ప్రభుత్వ రంగం కుదేలయ్యిందన్నారు. ఐఏఎస్‌లను ఇష్టం వచ్చినట్లు తీసుకెళ్తారా అని ప్రశ్నించారు.
'నియామకాలు ఆపింది మీరు. ఖాళీగా 15 లక్షల 62వేల ఉద్యోగాలు నింపంది మీరు. నిరుద్యోగం రాష్ట్రంలో ఎక్కువుందా? దేశంలో ఎక్కువుందా? నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా? దీనికి కారణం మీరు కాదా? ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి, జీడీపీ పతనమై... పరిశ్రమలు మూతపడే తీసుకొచ్చిన పరిపాలన మీది కాదా? మీ చేతగానితనం కాదా దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరని నేను అడుగుతున్నా.