తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్యారంటీల అమలు జరిగేలా బడ్జెట్ రూపకల్పన కోసమే ప్రజాపాలన దరఖాస్తులు : భట్టి విక్రమార్క

Minister Bhatti on Six Guarantees Implementation : ఆరు గ్యారంటీల అమలుకు కావలసిన బడ్జెట్ రూపకల్పన కోసమే ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇవాళ మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

Bhatti visits Madhira Constituency
Minister Bhatti on Six Guarantees Implementation

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2024, 6:51 PM IST

Minister Bhatti on Six Guarantees Implementation : కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు అమలుకాకుంటే బాగుండని కోరుకుంటున్న ప్రతిపక్షాల కలలు కల్లలుగానే మిగిలిపోతాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలుకు కావలసిన బడ్జెట్ రూపకల్పన కోసమే ప్రజా పాలనలో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు భట్టి స్పష్టం చేశారు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం : మంత్రి పొన్నం ప్రభాకర్

కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా? అంటూ ప్రచారం చేసిన బీఆర్‌ఎస్‌కు, చెంపపెట్టులాగా కరెంటు కావాలి, కాంగ్రెస్(Congress) కావాలి అని ప్రజలు తీర్పు ఇచ్చారని భట్టి పేర్కొన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని, ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అర్హులందరికీ అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలంమయ్యరంటూ బీఆర్ఎస్(BRS) నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Bhatti visits Madhira Constituency :కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, అసెంబ్లీలో శాసనసభ్యులు ప్రమాణ శ్రీకారం చేసిన గంటలోపే రెండు గ్యారంటీలను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు.

రాష్ట్రంలోని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం : భట్టి విక్రమార్క

ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక అరాచకంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. ఈ సంవత్సరపు చివరి త్రైమాసిక నిధులను కూడా ఎన్నికలకు ముందే డ్రా చేసి గత బీఆర్ఎస్ పాలకులు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దివాలా తీయించారని, ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు ఇవ్వాలేని పరిస్థితికి తెచ్చారని విమర్శించారు.

2014 సంవత్సరానికి ముందు ఉన్న ప్రభుత్వాలు రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించిన విద్యుత్తు ప్లాంట్లను తమ విజయంగా బీఆర్‌ఎస్‌ చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అవుట్‌డేటెడ్‌ టెక్నాలజీతో నిర్మాణం చేసి తెలంగాణ ప్రజలకు భారంగా మార్చారని దుయ్యబట్టారు. దామరచర్లలో నిర్మాణం చేస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ ప్రారంభం కాలేదన్నారు. విద్యుత్ రంగంపై గత ప్రభుత్వం మోపిన ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్ర ప్రజలకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు ఇస్తామన్నారు.

"కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా? అంటూ ప్రచారం చేసిన బీఆర్‌ఎస్‌కు, చెంపపెట్టులాగా కరెంటు కావాలి, కాంగ్రెస్ కావాలి అని ప్రజలు తీర్పు ఇచ్చారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక అరాచకంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేశాము. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రజలకు పథకాలను అందిస్తాము". - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి

గ్యారంటీల అమలులో బడ్జెట్ రూపకల్పనకు ప్రజాపాలన దరఖాస్తులు భట్టి విక్రమార్క

యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సహకరించండి - మనోజ్​ సోనితో సీఎం రేవంత్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details