ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం ఏజెన్సీలు, కార్మికులకు భారంగా మారుతోంది. ఖమ్మం జిల్లాలోని 1245 ప్రభుత్వ విద్యాలయాల పరిధిలో దాదాపు 2 వేల మంది మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 1359 పాఠశాలల్లో సుమారు 2వేల 225 మంది కార్మికులు విద్యార్థులకు రోజూ మధ్యాహ్న భోజనం అందించేందుకు పనిచేస్తున్నారు. ప్రభుత్వం చెల్లించే రుసుముల కింద ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి 4 రూపాయల 97 పైసలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7రూపాయల 45 పైసలు, ఉన్నత పాఠశాలల్లో 9రూపాయల 4 పైసలు చొప్పున చెల్లిస్తుంది.
మధ్యాహ్న భోజన కార్మికుల అవస్థలు... బిల్లులు రాక అప్పులతిప్పలు - mid day meals problems latest news
ఆకాశాన్నంటుతున్న నిత్యవసరాల ధరలతో మధ్యాహ్నభోజన ఏజెన్సీలు, కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సకాలంలో బిల్లులు రాక కష్టాలు పడుతుంటే... ప్రస్తుతం పెరిగిన ధరలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 3 కోట్లకు పైగా బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఏజెన్సీలు, కార్మికులకు మధ్యాహ్న భోజనం అందించడం భారంగా మారుతోంది. బంగారం తాకట్టుపెట్టి కొందరు, అందినకాడికి అప్పులు తెచ్చి మరికొందరు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాల్సిన దుస్థితి ఏర్పడింది.
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే కార్మికులు ముందే ఖర్చులు భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కేవలం బియ్యమే ఉచితంగా అందిస్తుంది. విద్యార్థుల హాజరు ప్రకారం మూడు నెలలకోసారి బిల్లు చెల్లిస్తారు. కరోనా ప్రభావంతో పాఠశాలలు మూతపడడటం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు ఉపాధి లేక అవస్థలు పడ్డారు. గతేడాది మార్చి బిల్లులు సైతం ఇప్పటికీ అందలేదు. ఖమ్మం జిల్లాలో గతేడాది బిల్లులు 4 కోట్లు అందాల్సి ఇప్పటి వరకు 3 కోట్లు మాత్రమే విడుదల అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ మరో కోటి రూపాయల బకాయిలున్నాయి. నిత్యావసరాలకు తోడు పెరిగిన గుడ్ల ధరలు మరింత భారమయ్యాయని కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ధరలు రాక గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. అప్పులు చేసి మరీ మధ్యాహ్న భోజనాలు అందిస్తున్నట్లు వివరించారు.
ఏళ్లుగా మధ్యాహ్న భోజనం అందిస్తున్న తమకు అప్పులే మిగిలుతున్నాయని కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటామని కార్మికులు తెగేసి చెబుతున్నారు.