Khammam Quarry: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం రెవెన్యూ పరిధిలోని 78 సర్వే నంబర్లో సుమారు 62 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమిలో ఉన్న బండరాయి గుట్టల్లో కంకర క్వారీకి అనుమతి ఇస్తూ.. భూగర్భగనుల శాఖ ఓ ప్రైవేటు వ్యక్తికి లీజుకు ఇచ్చింది. అనుమతులన్నాయన్న సాకుతో లీజుకు తీసుకున్న సదరు కంకర క్వారీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కంకర తీసేందుకు అనుమతి లేని యంత్రాలను ఉపయోగిస్తున్నారు. పరిమితికి మించిన లోతులో భారీగా రంధ్రాలు చేసి పేలుడు పదార్థాలతో పేలుళ్లు జరుపుతున్నారు. ఏళ్లుగా నిబంధనలేమీ పట్టించుకోకుండా ఇష్టానుసారం క్వారీలో పేలుళ్లు జరుపుతున్నారు.
పనులు ఆపి మరీ..
Mass explosions:ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భారీ పేలుళ్లు నిత్యకృత్యంగా మారాయి. పేలుళ్ల సమయంలో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లే రహదారుల వద్ద క్వారీ మనుషులు మోహరించి.. రాకపోకలు నిలిపి వేయడం, క్వారీ పక్కనే ఉన్న పంట భూములకు చెందిన రైతులను పొలంపనులు ఆపేయించి ఇళ్లకు పంపించేస్తున్నారు. ఇలా ఏళ్లుగా పరిమితికి మించి మరీ ఇష్టానుసారంగా భారీ శబ్దాలతో పేలుళ్లు నిర్వహిస్తున్నా.. పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు.
బీటలువారుతున్న గ్రామం..
Aregudem quarry Mass explosions: ఈ కంకర క్వారీలో భారీ పేలుళ్ల ప్రభావం క్వారీకి కూతవేటు దూరంలో ఉన్న ఆరెగూడెంపై తీవ్ర ప్రభావం పడుతోంది. కొన్నేళ్లుగా క్వారీలో పరిమితికి మించి ఇష్టారాజ్యంగా సాగుతున్న పేలుళ్లతో.. పక్కనే ఉన్న ఆరెగూడెం గ్రామస్థులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి నెలకొంది. బాంబుల శబ్దాలు వింటే చాలు.. గ్రామస్థులు ఉలిక్కిపడుతున్నారు. భారీ శబ్దాల ధాటికి ఎక్కడ ఇంటి పైకప్పు పెచ్చులూడి మీద పడుతుందోనని కొందరు.. ఇంటి గోడలు కూలిపోతాయేమోనని ఇంకొందరు.. ఇలా స్థానికులంతా భయం గుప్పిట బతుకుతున్నారు. దద్దరిల్లుతున్న భారీ పేలుళ్లతో చంటి పిల్లలు ఉలిక్కిపడి గుక్కపట్టి ఏడుస్తుంటే... వృద్ధుల గుండెల్లో దడ పుడుతోంది. పైసాపైసా కూడబెట్టుకుని కట్టుకున్న నిరుపేదల ఇళ్లన్నీ నెర్రెలు వారుతున్నాయి. ఇంటిగోడలు, పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఇంటి గోడల జాయింట్లు ఊడిపోవడం, బీటలు వారడమే కాకుండా.. డాబా మెట్లు కూడా కుప్పకూలిపోతున్నాయంటే పేలుళ్ల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.