Heavy loss to mango farmers : భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సుమారు 45 వేల ఎకరాల్లో రైతులు మామిడి పంటను సాగు చేస్తున్నారు. తోతాపురి, బంగినపల్లి, హిమాయత్, దసేరి, కేసరి, చిన్న రసాలు ఎక్కువగా పండిస్తున్నారు. ఈ ఏడాది సీజన్ ఆరంభంలో మామిడికి తెగుళ్లు సోకి పూత, కాతపై తీవ్ర ప్రభావమే చూపింది. ఆత్మస్థైర్యం కోల్పోకుండా మామిడిని కాపాడుకునేందుకు ఒక్కో రైతు రూ.30 వేలు ఖర్చు చేసి పంటను కాపాడుకున్నారు. తీరా.. కోత దశకు వచ్చే సమయానికి ఈదురుగాలులు, గాలివాన రైతులకు గుండెకోత మిగిల్చాయి.
చెట్లకు 30 శాతం కాయలే..: ప్రభుత్వ ఆదేశాలతో నష్టం అంచనా కోసం రంగంలోకి దిగిన వ్యవసాయ, ఉద్యానశాఖలు.. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురు గాలులతో వేలాది ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. ప్రస్తుతం 30 శాతం కాయలే చెట్లకు ఉన్నాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఎక్కువ నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సగానికి పడిపోయిన మామిడి ధర: ధరల పతనంతో దిగాలు చెందిన మామిడి రైతులు.. మూడేళ్లుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్నారు. పదేళ్ల క్రితం ఖమ్మం జిల్లాలో 70 వేల ఎకరాల్లో ఉంటే.. ప్రస్తుతం 35 వేల ఎకరాలకు పడిపోయింది. ఎకరాకు ఐదు టన్నుల దిగుబడి వస్తుందని ఆశించిన రైతులు ఈదురు గాలుల బీభత్సంతో రెండు టన్నులు రావడమే గగనంగా మారిందని చెబుతున్నారు. వర్షానికి ముందు టన్ను మామిడి ధర రూ.22 వేలు పలకగా.. ప్రస్తుతం సగానికి పడిపోయింది. మార్కెట్‌కు తరలించేందుకు రూ.7 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. పెట్టుబడి కూడా గిట్టుబాటు కాని పరిస్థితిలో ప్రభుత్వమే ఆదుకోవాలని మామిడి సాగుదారులు వేడుకుంటున్నారు.