ఖమ్మం జిల్లా మధిరలో అధికార పార్టీకి చెందిన వారికే తెరాస ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడం ఆ మాటలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. భట్టిపై తెరాస తరఫున పోటీ చేసి ఓడిపోయిన లింగాల కమల్‌రాజు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికైన తర్వాత అధికార తెరాస నాయకుల మాటే అన్ని ప్రభుత్వ శాఖల్లో చలామణి అవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
95 శాతం అధికార పార్టీ వారికే
రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న 637 మందిలో లక్షలోపు రుణం పొందే అర్హత కలిగిన వారు 284 మంది, 2 లక్షల లోపు 211, ఆపైన రుణం పొందే వారు 142 మంది ఉన్నారు. వీరిలో మొదటి విడతగా ఐదుగురికి, రెండో విడతలో 72, మూడో విడతలో 88 మందికి చెక్కులు అందించారు. ఈ మొత్తం లబ్ధిదారుల్లో 95 శాతానికి పైగా తెరాస నేతలు సూచించిన వారే ఉండటం గమనార్హం.
అర్హులను విస్మరిస్తారా
అర్హులను విస్మరించి అధికార పార్టీ నాయకులు సూచించిన వారిని ఎంపిక చేస్తారా అని పురపాలక కమిషనర్ దేవేందర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా, పారదర్శకంగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించాలని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.