Losses to the mango farmer in khammam: గత రెండేళ్లుగా ఎదురైన ప్రతికూల ఫలితాలతో నష్టాల ఊబిలో చిక్కుకున్న మామిడి రైతులకు ఈ సారైనా సాగు లాభాల రుచి చూపిస్తుందని ఆశించినా తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లుంది. పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో సుమారు 45వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఖమ్మం జిల్లాలో 30వేల ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 15 వేల ఎకరాల్లో రైతులు మామిడి తోటలు సాగు చేస్తున్నారు. గతేడాది నిరాశాజకమైన దిగుబడులతో సాగుదారులు నష్టాలే మూటగట్టుకున్నారు.
అంతకుముందు ఏడాది కోవిడ్‌తో మామిడికి డిమాండ్ లేక రైతులకు నష్టాలు తప్పలేదు. ఈ ఏడాది పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మామడి తోటలకు తామరపురుగు, ఇతర తెగుళ్లు సోకడంతో సాగుదారులు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. పూతదశను దాటి పిందె దశకు వస్తున్న మామిడి తోటలు తామర పురుగు ఉద్ధృతికి తట్టుకోలేకపోతున్నాయి. ఆశించిన మేర పూత వచ్చినప్పటికీ తామరపురుగు, ఇతర తెగుళ్లు సోకి పూత రాలిపోతుంది.
మామిడి తోటలు కాపాడుకునేందుకు సాగుదారులు అష్టకష్టాలు పడుతున్నారు. పూత దశ దాటితే కాత వచ్చే సమయంలో తామరపురుగుతోపాటు సోకుతున్న ఇతర తెగుళ్లను నివారించేందుకు ఇబ్బడిముబ్బడిగా పురుగుమందులు పిచికారి చేస్తున్నారు. ఒక్కో రైతు ఒక్కసారి మందుల పిచికారి చేస్తే సుమారు 20 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతోంది. పురుగుమందుల దుకాణాలు, ఉద్యానశాఖ అధికారులు ఎన్నిరకాల మందులు సూచించినా తెగుళ్లు నియంత్రణలోకి రావడం లేదని రైతులు వాపోతున్నారు.