అకాల వర్షానికి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో ధాన్యం తడిసిపోయింది. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం వర్షార్పణం అయ్యింది. భద్రాద్రి జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి మండలం, దమ్మపేట మండలాల్లో భారీ వర్షం వల్ల మొక్కజొన్న పొలాలు నేలవాలాయి.
మిరప: కళ్లాల్లో, తోటల్లో ఉంది. ప్రస్తుతం విపణి లేకపోవటం వల్ల అమ్ముకునే పరిస్థితిలేక అక్కడే ఉంచారు. ఇళ్ల దగ్గర కొంత ఉంది. శీతల గిడ్డంగుల్లో అంతా వ్యాపారుల సరుకే ఉండటం వల్ల అక్కడ భద్రపరుచుకునే పరిస్థితి లేదు.
వరి: కొంత ధాన్యం ఆరబెట్టి ఉండగా, మరికొంత పొలాల్లో కోతకు సిద్ధంగా ఉంది. వర్షం పడితే కోతకు వచ్చిన పంట మొత్తం రాలిపోతుంది. ఇప్పుడే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. సరిపోయేటన్ని పట్టాలు లేవు.
మొక్కజొన్న: కొంత చేతికి రాగా మరికొంత చేతికందటానికి సిద్ధంగా ఉంది. వర్షం కురిస్తే పంట నేలవాలిపోతుంది. కంకి దెబ్బతిని రంగు మారుతుంది. సరైన గిట్టుబాటు ధర ఉండదు.