తెలంగాణ

telangana

ETV Bharat / state

తలసేమియాతో ఆ చిన్నారుల మృత్యు పోరాటం - little kids struggle with thalassemia in khammam district

పుస్తకాలు చేతపట్టి బడికి వెళ్లాల్సిన చిన్నారులు.. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.  ఆటాపాటలతో అల్లరి చేస్తూ గడపాల్సిన ఆ పసిప్రాణాలు.... ప్రాణాంతక వ్యాధి కోరల్లో  చిక్కుకున్నాయి. ముక్కుపచ్చలారని తమ బిడ్డల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్న మహమ్మారిని ఎదిరించలేక ఆ తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లిపోతున్నాయి.

little kids struggle with thalassemia in khammam district
తలసేమియాతో ఆ చిన్నారులు మృత్యువుతో పోరాటం

By

Published : Dec 26, 2019, 9:33 AM IST

తలసేమియాతో ఆ చిన్నారులు మృత్యువుతో పోరాటం

అమాయకపు చూపులతో కల్మశం లేని మనసులతో ఆడుకుంటున్న ఈ చిన్నారులంతా... ప్రాణాంతక రోగంతో బాధపడుతున్నారంటే నమ్మగలమా..? కాని నిజమే.... ఈ స్వచ్ఛమైన నవ్వుల వెనుక తీరని విషాదం ఉంది. 20 రోజులకొకసారి శరీరంలోకి రక్తం ఎక్కించనిదే... వారు అలా ఆడుకోలేరు. అంతులేని నీరసం, బరువెక్కే కనురెప్పలు, నిమిషాల్లో పరిస్థితులే చేయి దాటిపోయే ప్రమాదం వారితో ఉంది. మందులు, సూదులతో గాయాలు చేస్తున్న తలసేమియా మహమ్మారి.... ఈ చిన్నారుల జీవితాన్ని ఛిద్రం చేస్తోంది.

తీరని వేదన:

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్న తలసేమియా వ్యాధి... చిన్నారుల బంగారు భవితకు శాపంగా మారుతోంది. బిడ్డలను బతికించుకునేందుకు కన్నవారిని పరుగులు పెట్టిస్తోంది. ఓ వైపు వెక్కిరిస్తున్న పేదరికం... మరోవైపు... ప్రాణాంతకంగా మారుతున్న తలసేమియా మహమ్మారి... బాధిత కుటుంబాల్లో తీరని వేదన మిగిలిస్తోంది.

700 మంది చిన్నారులు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 700 మంది చిన్నారులు తలసేమియా వ్యాధి బారిన పడినట్లు లెక్కలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లోని చిన్నారుల నిండు జీవితాల్ని తలసేమియా కబలిస్తోంది. మేనరికపు సంబంధాలు, అవగాహన రాహిత్యం వల్ల... వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది.

కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు:

20 రోజులకొకసారి రక్తం ఎక్కించకపోతే ఈ చిన్నారుల పరిస్థితి నిమిషాల్లోనే మారిపోతోంది. బిడ్డలకు తలసేమియా సోకిందని కొందరు వ్యక్తులు భార్యపిల్లలను కూడా వదిలేసి వెళ్లిపోగా... ఇంకొందరు... బిడ్డల కష్టాన్ని చూడలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒంటరి మహిళలు బిడ్డల కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు పడుతున్నామని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డ పరిస్థితి చూసి రోజు చచ్చిబతుకుతున్నామని రోధిస్తున్నారు.

తోటి పిల్లలంతా ఉత్సాహంగా ఆడుకుంటుంటే... నేనెందుకమ్మా ఆడుకోలేకపోతున్నా.. నాకెందుకమ్మా అలసట వస్తుందని ప్రశ్నిస్తున్న చిన్నారుల మాటలతో కన్నవారిని కలచివేస్తున్నాయి.

బాధితులకు అండగా సంకల్ప స్వచ్ఛంద సంస్థ

ఖమ్మంలోని సంకల్ప స్వచ్ఛంద సంస్థ... పదేళ్లుగా తలసేమియా బాధితులకు అండగా ఉంటోంది. ప్రతీ నెలా చిన్నారులకు రక్తం అందిస్తూ ప్రాణం పోస్తోంది. సంకల్ప సంస్థలో మేము సైతం అంటూ వైద్యులు రాజేశ్ గార్గే, కూరపాటి ప్రదీప్‌లు... చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు అందిస్తున్నారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం సేకరించి బాధితులకు అందజేస్తున్నారు. ప్రభుత్వమే వీరి కష్టాలకు పరిష్కారం చూపాలని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కోరుతున్నారు. స్థానిక పీహెచ్​సీల్లో మందులు అందుబాటులో ఉంచడంతోపాటు.... మారుమూల ప్రాంతాల నుంచి ఆస్పత్రికి వచ్చేందుకు బస్‌పాస్‌లు ఇవ్వాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: బోర్డు పునర్‌వ్యవస్థీకరణతో పట్టాలపైకి... రైల్వే!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details