కడలి సత్యనారాయణ. ఈ పేరు వినగానే కడలి ఇంటి పేరు.. సత్యనారాయణ వ్యక్తి పేరు అనుకుంటాం. కానీ ఈ పేరు 'లెటర్స్ టు లవ్' పుస్తక రచయిత్రిది. ఆ పుస్తకం కంటే ముందు ఈ పేరు వెనుక ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. ఖమ్మం జిల్లాకు చెందిన కడలికి తన తాతయ్య సత్యనారాయణ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఒకరకంగా చెప్పాలంటే కడలికి తెలుగు సాహిత్యంలో బీజం వేసింది ఆయనే. మనవరాలి ముద్దుముద్దు మాటలకు మురిసిపోయే తాత.. కవి సమ్మేళనాలు, రచయితల సమావేశాలకు వెంట తీసుకెళ్లేవాడు. చెకుముకి, చందమామ కథల పుస్తకాలు చదివించేవాడు. అలా బాల్యంలోనే పుస్తకాలతో స్నేహం చేసిన కడలి... 2010లో భ్రూణహత్యలపై కడలి రాసిన తొలి కవిత ఓ దినపత్రికలో అచ్చుకావడం వల్ల సత్యనారాయణ ఆనందానికి అవధులు లేవు. కడలిని మంచి రచయితగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉద్యోగానికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. కాలక్రమంలో సత్యనారాయణ కాలం చేశారు. అది తట్టుకోలేకపోయిన కడలి.. తాతయ్య తనతోనే ఉన్నారనే భావనతో సత్యనారాయణ పేరును తన పేరు పక్కన చేర్చుకుంది. కడలి సత్యనారాయణగా మారింది.
చలం తరహాలో..
అయితే చిన్నప్పటి నుంచి చదివిన చలం రచనలు కడలిని స్థిమితంగా ఉండనివ్వలేదు. మహిళలు, సమాజంపై ఆయన రచనలు కడలి ఆలోచన ధోరణిని మార్చివేశాయి. మహిళల పట్ల సమాజపు పోకడలను ప్రశ్నించే ప్రయత్నానికి నాంది పలికాయి. ఎంతో మంది సాహితీవేత్తలు, యువ కవులతో సాన్నిహిత్యం పెరిగేలా చేశాయి. ఈ క్రమంలోనే చలం ప్రేమలేఖల తరహాలోనే తాను కూడా ప్రేమలేఖలు రాయాలని సంకల్పించుకున్న కడలి... తనకు ఎదురైన అనుభవాలు, తన కళ్లముందు కదలాడే జంటల కథలను ప్రేమ కథలుగా మలిచి సామాజిక మాద్యమాల్లో పోస్టు చేసింది. ఫేస్ బుక్‌లోని కవిసంగమం గ్రూప్‌లోని ఎంతోమంది కవులు, రచయితలు కడలి ప్రేమ లేఖలను గుర్తించి అభినందించారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు ప్రేమలేఖలు రాయడం మొదలుపెట్టింది. అలా... 16 ఏళ్ల అమ్మాయి నుంచి 50 ఏళ్ల మహిళలపై వివిధ కోణాల్లో 40 ప్రేమ లేఖలు రాసింది. వాటిని లెటర్స్ టు లవ్ పేరుతో సంపుటిగా తొలి పుస్తకాన్ని విడుదల చేసింది.
తొలి ప్రయత్నంగా 'ప్రేమ':