తెలంగాణలో భూ సమస్యలకు చెక్ పెట్టడంతోపాటు, ప్రతీ అంగుళం భూమి లెక్క పక్కాగా ఉండేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌కు శ్రీకారం చుట్టింది. రికార్డులు తారుమారుకు అవకాశం లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో రికార్డుల్లో అనేక తప్పులు దొర్లాయి. వాటిని సవరించే అధికారి జిల్లా స్థాయిలో కలెక్టర్‌కు సైతం లేనంతగా నిబంధనలు పొందుపరిచారు. జిల్లాల్లో సమస్యల ఆధారంగా ఆన్‌లైన్‌లో సవరణలకు ఐచ్చికాలు విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలో దాదాపు అన్ని మండలాల నుంచి భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వేలాది మంది రైతుల్లో కొంతమంది పట్టా భూములు నిషేధిత జాబితాలో చేరాయని, మరికొంతమంది తమ పట్టాదారు పాసు పుస్తకంలో పేర్లు తప్పుగా నమోదుకావడం, సర్వే నెంబర్ల తేడా, భూమి హెచ్చుతగ్గులకు సంబంధించి దరఖాస్తులు చేసుకున్నారు.
రికార్డులతో కుస్తీ
ధరణి పోర్టల్‌లో భూములకు సంబంధించి ఖమ్మం జిల్లాలో సుమారు 10 వేలకుపైనే దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానంగా నిషేధిత భూముల జాబితాలోనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ కార్యాలయాల్లో కొన్ని రోజులుగా రికార్డుల పరిశీలన జోరుగా సాగుతోంది. రేయింబవళ్లు కార్యాలయాల్లోనే తిష్టవేసి రికార్డులతో కుస్తీ పడుతున్నారు.
నాకు వారసత్వంగా వచ్చిన భూమి.. 26 వ సర్వే భూమిలో 2 ఎకరాల 20 కుంటలు ఉంది. ధరణిలో ఎక్కి ఉంది. కేసీఆర్ పాస్ బుక్ కూడా వచ్చింది. మొన్న చూసుకోగా.. ప్రోహిబిషన్లో ఉందని తేలింది. నేను అధికారులను సంప్రదించగా.. అదంతా మాకు తెలియదు అంటున్నారు. ఇలాంటి సమస్య.. నాకు ఒక్కడికే కాదు.. చాలా మంది రైతులకు ఇలాంటి సమస్యే ఎదురవుతున్నాయి.