ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రంలో రాత్రివేళల్లో వైద్య సిబ్బంది ఉండడంలేదని కొవిడ్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసోలేషన్ కేంద్రంలో ఉన్న కొవిడ్ సోకిన వారికి ఆక్సిజన్ పరీక్షల కోసం వచ్చిన వైద్యుడు హనుమంతరావుతో బాధితులు వాగ్వాదానికి దిగి వైద్యానికి నిరాకరించారు.
రోడ్డు మీదికి వెళ్తామంటూ.. కొవిడ్ రోగుల ఆగ్రహం
ఐసోలేషన్ కేంద్రంలో రాత్రి పూట వైద్య సిబ్బంది ఎవరూ ఉండటం లేదని ఖమ్మం జిల్లాలో కొవిడ్ రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే తాము రోడ్డు మీదికి వెళ్తామని తెగేసి చెప్పారు. వైద్యుడితో బాధితులు వాగ్వాదానికి దిగి వైద్యానికి నిరాకరించారు.
పరిస్థితులు ఇలాగే ఉంటే తాము రోడ్డుమీదికి వెళ్తామని కొవిడ్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లలో ఉన్న తమకు సౌకర్యాలు ఉన్నాయని, తమను ఎందుకు ఐసోలేషన్ కేంద్రాలకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. రాత్రి వేళలో ఒక ఏఎన్ఎం కానీ, ఆశ కార్యకర్త కానీ, ఎటువంటి వైద్య సిబ్బంది ఉండడం లేదని వాపోయారు. రాత్రివేళలో తమకు ఇబ్బందులు వస్తే చూసుకునే వారు ఎవరు అని ప్రశ్నించారు. వైద్యం కోసం ఆశించి ఇక్కడికి వస్తే కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా రాత్రివేళ విధుల్లో ఉండాల్సిన పంచాయతీ మల్టీపర్పస్ ఉద్యోగి రాత్రివేళల్లో ఎందుకు ఉండట్లేదని వైద్యుడు ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగించింది. వైద్య సిబ్బంది కోసం కొవిడ్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. పంచాయతీ సిబ్బంది ఉంటే సమస్య ఉండదు అన్న తీరులో వైద్యుడు మాట్లాడడంతో బాధితులు అవాక్కయ్యారు. రాత్రి వేళలో పంచాయతీ సిబ్బంది పర్యవేక్షణలో కొవిడ్ బాధితులు ఉండేలా అధికారులు వ్యవహరిస్తున్న తీరు బాధితులకు ఆందోళన కలిగించింది. సౌకర్యాలు కల్పించకపోతే తాము ఇళ్లకు వెళ్లిపోతామని వారు తెగేసి చెబుతున్నారు. గత వారం రోజులుగా 20 మంది కొవిడ్ బాధితులు ఈ కేంద్రంలో ఉంటున్నారు.