Kishan Reddy Fires on BRS Government : రాష్ట్రంలో అభ్యర్థులను మందు ప్రకటించినా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజల చేతిలో భంగపాటు తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రకటనలో.. కమలం పార్టీకి ఎలాంటి తొందరలేదని అన్నారు. షెడ్యూల్ ప్రకారమే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని తమ పార్టీ భావిస్తుందని చెప్పారు. ఈ నెల 27న ఖమ్మంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ ఏర్పాట్లు పర్యవేక్షించడంతో పాటు.. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఖమ్మం జిల్లాలో పర్యటించారు.
రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఖమ్మంకు వచ్చిన కిషన్‌రెడ్డికి.. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వరంగల్ క్రాస్ రోడ్డులో భారీ గజమాలతో ఆయనను సత్కరించారు. అనంతరం నగరంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాసేపు బుల్లెట్ నడిపిన కిషన్‌రెడ్డి పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
Kishan Reddy Comments on KCR :తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయి.. ప్రస్తుతం మార్పు కోరుకుంటున్నారని కిషన్‌రెడ్డిఅభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కుటుంబ పాలన, ఆధిపత్యం, అహంకారమే పరిపాలిస్తున్నాయని మండిపడ్డారు. వెన్నుపోటు, మోసాలు, అబద్ధాలు, అవినీతికి కల్వకుంట్ల కుటుంబం.. కేరాఫ్ అడ్రస్‌గా మారిందని విమర్శించారు. దేశంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో అగ్రస్థానంలో ఉందని కిషన్‌రెడ్డి విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు మాఫియాగా మారి.. ప్రజా సంపదను దోచుకుంటున్నారని కిషన్‌రెడ్డి (Kishan Reddy Fires on BRS)ఆరోపించారు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టిన మంత్రి వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉన్న పథకాలు సక్రమంగా అమలు చేయకుండా ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు.. కొత్త పథకాలు తీసుకొస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందైనా.. తర్వాతైనాకాంగ్రెస్, భారత్ రాష్ట్ర సమితి కలవడం ఖాయమని కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు.