సాధారణ జ్వరం వచ్చినా రక్త, మూత్ర, తెల్లరక్త కణాల పరీక్షల పేరుతో సుమారు రూ.2500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంతకుమించిన సమస్యలొస్తే ఇక చెప్పాల్సిన పనిలేదు. వైద్య పరీక్షల విషయంలో పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన తెలంగాణ నిర్ధారణ పరీక్షల పథకం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెల్లబోతోంది. 52 రకాల రక్త, మూత్ర పరీక్షలే కాకుండా ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సిటీ, ఎంఆర్‌ఐ స్కానింగ్ పరీక్షలను ఉచితంగా అందించేందుకు ఉపక్రమించిన ఈ కార్యక్రమం ఏడాది గడిచినా అమలుకు నోచుకోవడం లేదు.
లక్షల రూపాయలు వెచ్చించి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ నిర్ధారణ పరీక్షల పథకం నిర్వహణ కోసం నిర్మించిన భవనాలు నిరుపయోగంగా మారాయి. లక్షల రూపాయలు వెచ్చించి ఆరు నెలల క్రితమే హడావిడిగా నిర్మాణాలను పూర్తి చేసి బోర్డులు తగిలించారు. కానీ అందులో పరికరాలు మాత్రం అందుబాటులోకి రాలేదు. పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకానికి సైతం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. 52 రకాల వైద్య పరీక్షలతోపాటు అధునాతన పరికరాలతో సామాన్యులకు సైతం అత్యున్నత సేవలందించే పరికరాలు కనిపించటం లేదు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలంటే అందుకు సంబంధించిన నిపుణులైన సిబ్బంది తప్పనిసరి. ఆ విషయంలోనూ ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నగర పరిధిలో ప్రారంభించిన ఈ పథకం కింద రోజుకు దాదాపు 8వేల పరీక్షల ఫలితాలు వెల్లడించడం సంచలనం సృష్టించింది.